పౌరసరఫరాలశాఖ మంత్రి మనోహర్ వాఖ్యలతో కలకలం
ప్రజా పంపిణీ ప్రక్రియ నుండి వైదొలగిన యండియు ఆపరేటర్ల నుండి వాహనాలను స్వాధీనం చేసుకోవాలని ఆర్డిఓలను రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. కాకినాడ జిల్లాలో జరిపిన తమ పర్యటనలో భాగంగా రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో పౌర సరఫరాలు, అనుబంధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆయా శాఖల ద్వారా అమలౌతున్న కార్యక్రమాలను సమీక్షించి, ఆదేశాలు జారీ చేశారు.ఈసందర్భంగా మంత్రి మనోహర్ గతంలో ధాన్యం సేకరణలో మోసపోయిన రైతుల నుండి ఫిర్యాదులు స్వీకరించాలన్నారు.
ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలోని 251 ఎంఎల్ఎస్ పాయింట్లలో తనిఖీలు నిర్వహించగా, 189 పాయింట్లలో నిల్వల వ్యత్యాసాలు కనుగొనడం జరిగిందని, అక్రమాలకు పాల్పడిన సప్లయిర్స్ పై కేసులు పెట్టి బ్లాక్ లిస్ట్ చేసామని మంత్రి తెలిపారు. కాకినాడ పోర్టు కేంద్రంగా బియ్యం మాఫియా వ్యవస్థీకృతమైందని, చిత్తూరు నుండి కాకినాడ వరకూ పేదల పొట్టగొట్టి దోచిన బియ్యాని పోర్టు ద్వారా ఎగుమతి చేసి కోట్లాది రూపాయాలు ఆర్జించారని, అక్రమార్కులను విడిచిపెట్టేది లేదన్నారు. అధికారులు పారదర్శకంగా, నిజాయితీగా పనిచేయాలని, దోపిడీదారులకు సహకరించే వారిని ఉపేక్షించమన్నారు. గత ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ పేర 36,300 కోట్ల రూపాయల భారీ అప్పులు చేసిందని, రైతులకు మాత్రం 1600 కోట్ల బకాయిపైట్టి వెళ్లిందన్నారు.
సమీక్షలో ప్రజాపంపిణీ, మద్యాహ్న భోజన పధకం అమలు అంశాల్లో వివిధ శాఖల అధికారుల మద్య సమన్వలోపం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసారు. పిడిఎస్ ద్వారా గోధమ పిండి కొరకు కార్డుదారుల నుండి డిమాండు ఉన్నప్పటికీ, ఏప్రియల్ నెల నుండి అవసరమైన సరఫరా కోసం పౌర సరఫరా అధికారులు ఇండెంట్ చేయకపోపడం పట్ల ఆయన ఆగ్రహం వెలిబుచ్చారు.
సిఎస్ డిటిలు పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసిన నాణ్యమైన బియ్యా న్నిసక్రమంగా వినియోగిస్తున్నదీ లేనిదీ తప్పని సరిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. పిడిఎస్ సరుకులను రవాణా చేసే వాహనాలపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమ తరలింపులను అరికట్టాలని ఆదేశించారు. జిల్లాలో కొత్త రేషన్ కార్డులు, కార్డుల విభజన కోసం ప్రజల నుండి అందిన ధరఖాస్తుల వివరాలను సమర్పించాలని, తీర ప్రాంతాలల్లోని మత్స్యకార కాలనీలలో నివసిస్తున్న కుటుంబాలకు అదనపు సరఫరాలు అందించేందుకు వీలుగా వినూత్న విధానాన్ని ప్రతిపాదించాలని కోరారు.