రామ్ పోతినేని ఈసారి హీరోగానే కాదు.. దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ‘RAPO23’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ప్రీ-లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
ఈ పోస్టర్లో నలుపు రంగు దుస్తులు ధరించి వెనుకకు తిరిగి నిలబడిన రామ్.. ఒక చేతిలో గన్, మరో చేతిలో టెడ్డీ బేర్ పట్టుకొని కనిపించాడు. ఈ లుక్కు ‘లోన్ వుల్ఫ్’ అనే క్యాప్షన్‌ను జోడించారు. దీంతో సినిమా కథ, రామ్ పాత్ర ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి నెలకొంది. త్వరలోనే టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో రామ్‌కు ప్రతినాయకుడిగా సీనియర్ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ నటిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయనకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌కు రామ్ పోతినేని కథ అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మరి దర్శకుడిగా రామ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.








