మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయంలో సంక్రాంతి 2027 రేసుపై గత కొంతకాలంగా కొనసాగుతున్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’, ‘కాకా’ చిత్రాల్లో ఏది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందనే చర్చకు రచయిత కోన వెంకట్ తన తాజా ప్రకటనతో క్లారిటీ ఇచ్చారు. ‘కాకా’ సినిమా అనుకున్న ప్రకారం జనవరి 13న థియేటర్లలోకి వస్తుందని ఆయన అధికారికంగా వెల్లడించారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన కోన వెంకట్.. సినిమా విడుదలపై వస్తున్న ఊహాగానాలకు, తప్పుడు ప్రచారాలకు ఇక ముగింపు పలకాలని పేర్కొన్నారు. అభిమానులను కొంత నిరాశపరిచినా, తాము ప్రకటించిన విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. జనవరి 13న ‘కాకా’ సినిమాతో సంక్రాంతి పండుగను మరింత ప్రత్యేకంగా మార్చబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అంతేకాకుండా షూటింగ్ లొకేషన్ నుంచి మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ స్టైలిష్ ఫొటోను కూడా కోన వెంకట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా అప్డేట్ మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. అనశ్వర రాజన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు సంక్రాంతి విడుదల తేదీపై స్పష్టత రావడంతో మెగా అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ‘కాకా’ సంక్రాంతి బరిలో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.








