కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన మూడో సినిమా ‘సీన్’. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నజ్రియా ఫహద్, నస్లెన్ కీలక పాత్రల్లో నటించారు. క్రైమ్, కామెడీ అంశాలను కలిపి రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? సూర్య మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
పోలీస్ డిపార్ట్మెంట్లో డీఎస్పీగా పనిచేస్తున్న ప్రేమ్ రాజ్‌కు ఉద్యోగం చేయడం కంటే రాజీనామా చేయాలనే ఆలోచనే ఎక్కువగా ఉంటుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా అతని పై అధికారులు మాత్రం రాజీనామాను అంగీకరించరు. ఎందుకంటే క్లిష్టమైన కేసులను సైతం ఎంతో సులభంగా పరిష్కరించగల సమర్థత అతనికి ఉంటుంది. అలాంటి సమయంలో నగరంలో వరుస హత్యలు జరుగుతుండటంతో పోలీసులకు కొత్త తలనొప్పి మొదలవుతుంది. పెర్ఫ్యూమ్ కిల్లర్ పేరుతో గుర్తింపు పొందిన ఓ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడం ప్రేమ్ రాజ్‌కు పెద్ద సవాలుగా మారుతుంది. అసలు ఈ హత్యల వెనుక ఉన్న రహస్యం ఏమిటి? కిల్లర్ ఎంచుకున్న ప్రత్యేకమైన పద్ధతి వెనుక కారణమేంటి? తన సహాయకురాలు మాయతో కలిసి ప్రేమ్ రాజ్ ఈ కేసును ఎలా పరిష్కరించాడు? అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ దర్శకుడు జీతూ మాధవన్ ఎంచుకున్న క్రైమ్ కామెడీ కాన్సెప్ట్. ఒకవైపు హత్యల మిస్టరీని కొనసాగిస్తూనే, మరోవైపు నవ్వులు పంచే సన్నివేశాలను జోడించడం బాగుంది. ముఖ్యంగా కథలోని కొన్ని ఆసక్తికరమైన మలుపులు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి.
ఇక హీరో సూర్య విషయానికి వస్తే.. తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. గతంలో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో కనిపించిన ఆయన, ఈ సినిమాలో మాత్రం చాలా కొత్తగా కనిపిస్తారు. యంగ్ లుక్, స్టైలిష్ మేకోవర్‌తో పాటు తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సీరియస్ సన్నివేశాల మధ్య వచ్చే హాస్య సన్నివేశాల్లో సూర్య నటన బాగుంది.
నజ్రియా ఫహద్ కూడా తన పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. సూర్యతో ఆమె కెమిస్ట్రీ, ఇద్దరి మధ్య వచ్చే సరదా సన్నివేశాలు సినిమాకు మంచి వినోదాన్ని అందిస్తాయి. ముఖ్యంగా మార్చురీ నేపథ్యంలో వచ్చే ప్రపోజల్ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది.
ఇక నస్లెన్ ఈ సినిమాలో తన గత పాత్రలకు భిన్నంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడం మరో విశేషం. చాలా సాధారణంగా కనిపిస్తూనే అవసరమైన సన్నివేశాల్లో తన నటనతో మెప్పించారు. మరోవైపు సుషిన్ శ్యామ్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి ప్లస్‌గా నిలిచాయి.
మైనస్ పాయింట్స్:
సినిమాలో ప్రధానంగా నిరాశపరిచే అంశం విలన్ పాత్రను డిజైన్ చేసిన విధానం. కథలో అతని పాత్రకు మంచి ప్రాధాన్యత ఉన్నప్పటికీ, అతని గతం గురించి వివరించే సన్నివేశాలు అంత బలంగా అనిపించవు. అతను ఇలాంటి నేరాలకు ఎందుకు పాల్పడుతున్నాడనే విషయాన్ని మరింత ప్రభావవంతంగా చూపించి ఉంటే బాగుండేది.
అలాగే ఫస్టాఫ్‌లో కథనం కొంత నెమ్మదిగా సాగుతుంది. అక్కడక్కడా వచ్చే కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ, కథలో వేగం మాత్రం ఆశించిన స్థాయిలో ఉండదు. హీరో, విలన్ మధ్య మరింత ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఉంటాయని ఆశించిన ప్రేక్షకులకు కొన్ని సందర్భాల్లో నిరాశ తప్పదు.
ప్రముఖ నటుడు లాల్ పాత్రను కూడా దర్శకుడు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయారు. మధ్యలో ఆయన పాత్ర కనిపించకుండా పోయి, చివర్లో మళ్లీ తెరపైకి రావడం కొంత అసంపూర్ణంగా అనిపిస్తుంది. అలాగే సూర్య తల్లిదండ్రులు కూడా ఇన్వెస్టిగేషన్లో భాగం కావడం వంటి సన్నివేశాలు కథకు అంతగా సహజంగా సరిపోలేదు. ఇక టోవినో థామస్ చిన్న పాత్రలో కనిపించడం బాగున్నప్పటికీ, ఆయనకు ఇంకాస్త ఎక్కువ సమయం కేటాయించి ఉంటే బాగుండేది.
సాంకేతిక వర్గం:
సాంకేతికంగా సినిమా మంచి ప్రమాణాలతో రూపొందింది. కథకు తగిన లొకేషన్లు, సెట్స్, ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు మంచి వాతావరణాన్ని తీసుకొచ్చాయి. సుషిన్ శ్యామ్ సంగీతం, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ కూడా కథకు అనుగుణంగా సాగుతుంది. ఎడిటింగ్ విషయంలో మాత్రం మరికొంత మెరుగుదల అవసరమని అనిపిస్తుంది. కొన్ని పాత్రలకు డబ్బింగ్ కూడా అంతగా సెట్ కాలేదు. దర్శకుడు జీతూ మాధవన్ ఒక కొత్త తరహా క్రైమ్ కామెడీని ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశారు. ఆయన ఆలోచన బాగున్నప్పటికీ, కథనంలోని కొన్ని లోపాల కారణంగా సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.








