ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘రోబో’ కూడా ఒకటి. 2010లోనే పాన్ ఇండియా సినిమా అంటే ఏంటో చూపించిన ఈ మూవీ.. సూపర్ స్టార్ రజినీకాంత్ స్టార్డమ్‌కు శంకర్ విజన్ తోడవడంతో ఇండియన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.
అప్పట్లోనే బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన ‘రోబో’.. ఇప్పుడు రీరిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా మారింది.
అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో సడెన్‌గా హైప్ పెరిగిపోయింది. ముఖ్యంగా సినిమాలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌కు సంబంధించిన సీన్స్‌ను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘రోబో’ను మళ్లీ థియేటర్లలో చూడాలనే డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాదు.. కేవలం సాధారణ రీరిలీజ్ కాకుండా, ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీని ప్రీమియం ఫార్మాట్స్‌లో గ్రాండ్‌గా రీరిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
ఇలాంటి విజువల్ వండర్‌ను కేవలం 4Kలో రీరిలీజ్ చేస్తే సరిపోదని.. IMAX, ఇతర ప్రీమియం ఫార్మాట్స్‌లో కూడా విడుదల చేస్తే థియేటర్లలో అసలు ‘రోబో’ రేంజ్ ఏంటో మరోసారి చూపించవచ్చని కామెంట్స్ చేస్తున్నారు.
ముఖ్యంగా తెలుగు యువత నుంచి మొదలైన ఈ రీరిలీజ్ డిమాండ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత వైరల్‌గా మారింది. అప్పట్లో చూసిన వాళ్లే కాకుండా.. ఈ సినిమాను థియేటర్లలో చూడలేకపోయిన కొత్త జనరేషన్ కూడా ‘రోబో’ను బిగ్ స్క్రీన్‌పై చూడాలని ఆసక్తి చూపిస్తోంది.
శంకర్ తన ప్రైమ్ టైమ్‌లో తెరకెక్కించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక రజినీకాంత్ సరసన ఐశ్వర్య రాయ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం.. అప్పట్లోనే హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
మరి సోషల్ మీడియాలో పెరుగుతున్న ఈ రీరిలీజ్ డిమాండ్‌పై సన్ పిక్చర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ‘రోబో’ను నిజంగానే ప్రీమియం ఫార్మాట్స్‌లో గ్రాండ్‌గా రీరిలీజ్ చేస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








