లోక్ సభ స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. ఇండియా కూటమి నేతలతో రాజ్ నాథ్ సింగ్ జరిపిన చర్చలు ఫలించలేదు. డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇస్తే స్పీకర్ ఎన్నికకు ఏకగ్రీవంగా సహకరిస్తామని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రతిపాదించగా.. అందుకు ఎన్డీయే పక్షం నో చెప్పింది. దీంతో ఇండియా కూటమి లోక్ సభ స్పీకర్ పదవి ఎన్నికలకు సిద్ధమైంది. దేశంలోనే తొలిసారి లోక్ సభ స్పీకర్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకూ లోక్ సభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరగ్గా.. ఈసారి ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య అభిప్రాయం కలవకపోవడంతో స్పీకర్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్డీయే లోక్ సభ స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లా నేడు నామినేషన్ వేయనున్నారు. ఓం బిర్లా నామినేషన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా.. కేంద్రమంత్రులు, ఎన్డీయే పక్షాల నేతలు హాజరు కానున్నారు. ఓం బిర్లా నామినేషన్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇండియా కూటమి నుంచి లోక్ సభ స్పీకర్ అభ్యర్థిగా ఎంపీ సురేష్ నామినేషన్ వేయనున్నారు.