వచ్చే ఏడాది సమ్మర్లో రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’, సూపర్ స్టార్ మహేష్ బాబు–ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాలు అటుఇటుగా నెల రోజుల వ్యవధిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. రెండు సినిమాలపైనా భారీ అంచనాలు ఉండటంతో.. ఈ గ్యాప్ సరిపోతుందా అనే చర్చ మొదలైంది.
ఇదే విషయంపై ‘స్పిరిట్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సరదాగా స్పందించాడు. ‘స్పిరిట్’ కంటే ‘వారణాసి’ పెద్ద సినిమా అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించిన వంగ.. రెండు సినిమాల మధ్య ఉన్న గ్యాప్ సరిపోతుందని చెప్పాడు. ఒకవేళ అవసరం అనిపిస్తే ‘వారణాసి’ కోసం తమ సినిమా విడుదల తేదీ విషయంలో కాస్త వెనక్కి జరగడానికి కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు.
అయితే ‘స్పిరిట్’ మాత్రం ప్రకటించిన తేదీకే థియేటర్లలోకి వస్తుందని మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి ఇంకా కొంత భాగం బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. ఆ షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయించాలని సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా ఆయన చెప్పిన ప్రకారం, షూటింగ్ షెడ్యూల్స్ మధ్య గ్యాప్‌లను కూడా పోస్ట్ ప్రొడక్షన్, సన్నివేశాల నాణ్యతపై మరింత దృష్టి పెట్టేందుకు ఉపయోగిస్తున్నారు.
ఇక తన సినిమాలకు సాధారణంగా A సర్టిఫికేట్ వస్తుందని చెప్పే సందీప్ రెడ్డి వంగ.. ‘స్పిరిట్’కు కూడా కచ్చితంగా A సర్టిఫికేట్ వస్తుందని అంటున్నాడు. ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.
మొత్తానికి ‘స్పిరిట్’, ‘వారణాసి’ సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటంతో.. ఈ రెండు భారీ చిత్రాల మధ్య పోటీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఇప్పటి నుంచే నెలకొంది.








