సార్వత్రిక ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలను ప్రతి ఒక్కరూ సవాల్ గా తీసుకుని పోరాడటం వల్లే ఘన విజయం సాధ్యమైందన్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొని పోరాడిన వారికి తప్పకుండా నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు.కష్టపడ్డ వారి వివరాలను సేకరిస్తున్నామన్నారు. పార్టీ నేతలు ఇచ్చే రిపోర్టులతో పాటు, ఇతర మార్గాల్లో కూడా రిపోర్టులు తెప్పించుకుని కష్టపడిన వారికే పదువులు వచ్చేలా చేస్తామన్నారు. పార్టీ కోసం శ్రమించిన వారిని ఆదుకుంటేనే పార్టీ కూడా బలంగా ఉంటుందన్నారు.
ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్ లు, పార్లమెంట్ అధ్యక్షులతో చంద్రబాబు టెలీకాన్ఫ రెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….‘‘ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్ల పాటు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, యువగళం,రా…కదలిరా, ప్రజాగళం వంటి వివిధ కార్యక్రమాలతో ప్రజలతోనే ఉన్నాం. సాగునీటి ప్రాజెక్టులను కూడా సందర్శించి గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాం. గత ఐదేళ్ల పాటు కార్యకర్తలు, నాయకులపై వైసీపీ ప్రభుత్వం ఎన్నో అక్రమ కేసులు పెట్టింది. వీటన్నింటిని తట్టుకుని నిలబడ్డారు. ఎన్నికల్లో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కలిసి పని చేయడం వల్ల 57 శాతం ఓట్లు సాధించి, 93 శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
పార్టీకి నష్టం చేసిన వారికి పార్టీలోకి ప్రవేశం లేదు
‘‘అధికారాన్ని అడ్డం పెట్టుకుని పార్టీకి, కార్యకర్తలకు నష్టం చేసి, వేధించిన వైసీపీ నేతలకు తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ లేదు. పార్టీకి అన్యాయం చేసిన వారిని ఉపేక్షించేది లేదు. అధికారం వచ్చిందని స్వలాభం కోసం వచ్చే వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రజలు నమ్మకం పెట్టుకుని కూటమిని గెలిపించారు..వారి నమ్మకాన్ని నిలబెడదాం. పొత్తులో భాగంగా 31 మంది పార్టీ ఇన్‌ఛార్జ్ లకు సీట్లు రాలేదని గుర్తు చేశారు.అయినా వెనకడుగు వేయకుండా కూటమి గెలుపే లక్ష్యంగా పని చేశారు. అందువల్లే చరిత్రలో లేని విధంగా ఫలితాలు వచ్చాయి. నేను కూడా ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్నా. రైట్ మ్యాన్…రైట్ పొజిషన్ అనే విధంగా భవిష్యత్తులో నిర్ణయాలు ఉంటాయి. 2029 ఎన్నికల్లో విజయానికి కూడా ఇప్పటి నుండే ప్రణాళిక ఉండాలి.’’ అని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.