తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ల భద్రత, క్యాస్టింగ్ కౌచ్ అంశంపై నటి చాందిని చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ది ఆడిషన్ షో’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. 2015లో ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ సమయంలో ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా అవకాశం ఇస్తామని ఓ వ్యక్తి తనను సంప్రదించాడని, ఆ తర్వాత ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడుతూ ‘కమిట్మెంట్’ గురించి అడిగాడని చాందిని ఆరోపించారు. తాను అంగీకరించకపోవడంతో తన తల్లికి కూడా ఫోన్ చేసి అవమానకరంగా మాట్లాడాడని తెలిపారు.
ఈ ఘటన అనంతరం సదరు వ్యక్తి తనపై పరిశ్రమలో నెగెటివ్ ప్రచారం చేశాడని చాందిని పేర్కొన్నారు. ‘‘చాందినికి పొగరు ఎక్కువ, ఆమెతో పనిచేయడం కష్టం’’ అంటూ రూమర్లు వ్యాప్తి చేశారని, ఆ ముద్ర ఇప్పటికీ తనను వెంటాడుతోందని చెప్పారు. అయితే అడ్డదారుల్లో అవకాశాలు పొందడం కంటే కష్టమైనా తన సొంత ప్రతిభతో ముందుకు వెళ్లడమే మంచిదని ఆమె స్పష్టం చేశారు. నిజాయితీగా వ్యవహరించే వారితో మాత్రమే తాను సౌకర్యంగా పనిచేస్తానని, తేడాగా ప్రవర్తిస్తే మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వనని తేల్చి చెప్పారు.
2024లో ‘గామి’, ‘ఏవం’, ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాల ప్రమోషన్ సమయంలో ఇదే వ్యక్తి మరోసారి తనను కలిసిన విషయాన్ని కూడా చాందిని గుర్తుచేసుకున్నారు. 2015లో జ్యువెలరీ యాడ్ కోసం మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేయగా, అప్పట్లో తనను లైంగికంగా వేధించిన విషయాన్ని నేరుగా ఆయన ముఖం మీదే ప్రశ్నించానని చెప్పారు. గతంలో తాను చాలా సాఫ్ట్‌గా ఉండేదాన్నని, పరిశ్రమలో ఎదురైన ఇలాంటి అనుభవాల కారణంగానే తనను తాను రక్షించుకునేందుకు కఠిన వైఖరిని అలవర్చుకున్నానని చాందిని తెలిపారు. ఆమె తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్లో తీవ్ర చర్చకు దారితీశాయి.








