భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’పై రోజురోజుకూ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. దర్శకుడు నితీష్ తివారీ రెండు భాగాలుగా రూపొందిస్తున్న ఈ భారీ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో సంచలన అప్డేట్ బయటకు వచ్చింది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ, పంపిణీ సంస్థ సోనీ పిక్చర్స్ ఈ చిత్రం అంతర్జాతీయ పంపిణీ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ బ్లాక్బస్టర్ల తరహాలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సంస్థ భారీ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
అంతేకాదు, గ్లోబల్ ప్రమోషన్స్ కోసం సోనీ పిక్చర్స్ ఒక్కదానిగానే సుమారు రూ.235 కోట్లు ఖర్చు చేయనుండగా, చిత్ర నిర్మాతలు మరో రూ.140 కోట్లు ప్రచార కార్యక్రమాలకు కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో కేవలం ప్రచార కార్యక్రమాల కోసమే మొత్తం రూ.375 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమాచారం నిజమైతే, భారతీయ సినిమా చరిత్రలో ప్రచారం కోసం కేటాయించిన అత్యధిక బడ్జెట్‌గా ఇది నిలిచే అవకాశం ఉంది.
ఈ చిత్రానికి సంగీత దిగ్గజాలు ఏ.ఆర్. రెహమాన్ మరియు హాన్స్ జిమ్మర్ సంగీతాన్ని అందిస్తుండగా, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, ఐమాక్స్ ఫార్మాట్లో ప్రేక్షకులకు అద్భుతమైన సినీ అనుభూతిని అందించేందుకు మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రామాయణ’ ట్రైలర్ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు సమాచారం. దీంతో ఈ ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








