ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘రక్త చరిత్ర’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం 2010లో విడుదలై రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో భారీ చర్చకు దారితీసింది. ఇప్పుడు దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ-రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, వర్మ చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
త్రిపుర క్రియేషన్స్, నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా జూలై 17న ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ, ‘రక్త చరిత్ర’ వెనుక ఉన్న ఆలోచనను వివరించారు.
“రాయలసీమలో జరిగిన నిజ జీవిత సంఘటనలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ సినిమాను తెరకెక్కించాం. నా కెరీర్లో అత్యంత ప్రత్యేకమైన చిత్రాల్లో ఇది కూడా ఒకటి. ప్రతీకారం, హింస చివరికి ఎంతటి వినాశనానికి దారితీస్తాయో చూపించడమే ఈ సినిమా ఉద్దేశం” అని వర్మ తెలిపారు.
అయితే అందరి దృష్టిని ఆకర్షించిన ప్రశ్న మాత్రం ‘రక్త చరిత్ర పార్ట్-3 వస్తుందా?’ అన్నదే. దీనికి స్పందించిన వర్మ… “రెండో భాగంతోనే ప్రధాన పాత్రల కథ పూర్తయింది. దానికి కొనసాగింపుగా మూడో భాగం తీసే అవకాశం లేదు. కాబట్టి ‘రక్త చరిత్ర పార్ట్-3’ ఉండదు” అని స్పష్టంగా తేల్చి చెప్పారు.
ఇక రాయలసీమలో ఫ్యాక్షన్ ఘర్షణలు తగ్గిపోయిన ఈ సమయంలో సినిమాను మళ్లీ విడుదల చేయడం వివాదాలకు దారితీయదా? అనే ప్రశ్నకు కూడా ఆయన ఆసక్తికరంగా స్పందించారు. “ఇప్పుడు సోషల్ మీడియాలో మాటల యుద్ధాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు జరిగినట్లుగా బహిరంగంగా ఫ్యాక్షన్ ఘర్షణలు జరిగే పరిస్థితి ఇప్పుడు లేదు” అని అన్నారు.
ఈ సందర్భంగా తన సినిమా అభిరుచుల గురించి కూడా వర్మ ఓపెన్‌గా మాట్లాడారు. “నేను ఎప్పుడూ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు తీయను. అలాంటి కథలు నన్ను ఆకట్టుకోవు. అలాగే పౌరాణిక చిత్రాలపై కూడా నాకు ఆసక్తి లేదు. భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ కంటే… నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కే రియలిస్టిక్ డ్రామాలే నాకు ఎక్కువగా నచ్చుతాయి” అని చెప్పారు.
ప్రస్తుతం హిందీలో పోలీస్ వ్యవస్థ నేపథ్యంతో ఓ సినిమా రూపొందిస్తున్నానని, అందుకే ఎక్కువ సమయం ముంబైలోనే గడుపుతున్నానని కూడా వర్మ వెల్లడించారు.
మొత్తానికి ‘రక్త చరిత్ర’ రీ-రిలీజ్‌తో పాటు రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారాయి.








