2001లో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’… 2002లో ‘వాసు’… 2004లో ‘మల్లీశ్వరి’… ఈ మూడు సినిమాలు ఒక్కటే చాలు. త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ వెంకీ మామ నోట పడితే ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో చెప్పడానికి. కామెడీ అయినా… ఎమోషన్ అయినా… ఫ్యామిలీ సీన్స్ అయినా… ఈ కాంబోకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటిది ఇన్ని ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ స్వయంగా వెంకటేష్‌ని డైరెక్ట్ చేస్తుండటంతో ‘ఆదర్శ కుటుంబం’పై అంచనాలు మామూలుగా లేవు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతోంది.
ఇక ఈ భారీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నివేతా పేతురాజ్ నటించబోతుందట. అంతేకాదు… ఆమె పాత్ర ఓ పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌దని టాక్. గ్లామర్‌తో పాటు కథలో కీలకమైన రోల్‌లో నివేత కనిపించనుందట.
త్రివిక్రమ్ సినిమాల్లో నివేతా పేతురాజ్ కనిపించడం ఇది రెండోసారి. ఇంతకుముందు ‘అల వైకుంఠపురములో’ సినిమాలో అల్లు అర్జున్ మరదలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్క్రీన్ టైమ్ తక్కువైనా… తన ప్రెజెన్స్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. అయితే గత కొంతకాలంగా తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సైలెంట్‌గా ఉన్న నివేతకు… ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’ మంచి కమ్‌బ్యాక్ మూవీ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక త్రివిక్రమ్ కెరీర్‌ని గమనిస్తే… ఒకప్పుడు ఆయన సినిమాల్లో సెకండ్ హీరోయిన్ అనే కాన్సెప్ట్ ఉండేది కాదు. ‘నువ్వే నువ్వే’, ‘అతడు’, ‘ఖలేజా’ లాంటి సినిమాలు పూర్తిగా కథ, హీరో-హీరోయిన్ ట్రాక్ చుట్టూనే తిరిగేవి. కానీ తర్వాత మాత్రం ట్రెండ్ మార్చేశారు గురూజీ. ‘అ ఆ’ నుంచి ‘అజ్ఞాతవాసి’, ‘అరవింద సమేత’, ‘గుంటూరు కారం’ వరకు దాదాపు ప్రతి సినిమాలో సెకండ్ హీరోయిన్ ట్రాక్ కనిపిస్తోంది. అయితే అందులో ‘అ ఆ’లో అనుపమ పరమేశ్వరన్ పాత్రకే ఎక్కువ గుర్తింపు వచ్చింది. మరి ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’లో నివేతా పాత్రకు ఎంత స్కోప్ ఇచ్చారో చూడాలి.
ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో సాలిడ్ బజ్ మ్యూజిక్ డిపార్ట్‌మెంట్ గురించే. మొదట ఈ ప్రాజెక్ట్‌కి ‘యానిమల్’ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్‌ను అనుకున్నారట. కానీ ఇప్పుడు ఆయన ప్లేస్‌లో ఎస్.ఎస్. తమన్ వచ్చేశాడని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే తమన్ ఆధ్వర్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జోరుగా జరుగుతున్నాయట. వెంకీ-త్రివిక్రమ్ కాంబో అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎంత కనెక్ట్ ఉంటుందో తెలిసిందే. అందుకే ఆల్బమ్‌ని కూడా అదే రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారట.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా… వచ్చే మే చివరికి మొత్తం షూట్ కంప్లీట్ చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారట. ఇక రిలీజ్ విషయానికి వస్తే… ఈ సినిమాను దసరా కానుకగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నప్పటికీ… ఇప్పటివరకు అఫీషియల్ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాకే ప్రమోషన్స్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట.
మరి ఈ సినిమాలో నివేతా పేతురాజ్ పాత్ర… ‘అ ఆ’లో అనుపమలా గుర్తుండిపోతుందా? లేక ‘గుంటూరు కారం’లో మీనాక్షిలా సైలెంట్ అయిపోతుందా? అనేది చూడాలి.








