ప్రముఖ నటి, సామాజిక కార్యకర్త రేణుదేశాయ్ తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్యకర దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ఫేక్ అకౌంట్ల ద్వారా తన వ్యక్తిగత జీవితం, విడాకులు, రాజకీయ మద్దతు మరియు భరణం వంటి విషయాలపై అసభ్య పదజాలంతో కామెంట్లు చేస్తున్న వారిపై ఆమె మండిపడ్డారు. నెగిటివ్ కామెంట్స్ చేసే వారిని గుర్తించి, నేరుగా వారి ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రుల ముందే వారి దుర్మార్గాలను ఎండగడతానని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను విడుదల చేసి ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
గత నెలలో హైదరాబాద్లో నిర్వహించిన వీధి కుక్కల సంరక్షణ ప్రెస్ మీట్ అంశాన్ని ప్రస్తావిస్తూ, తన మాటలను కొందరు వక్రీకరించారని రేణు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక చిన్నారి మరణించిన ఘటనకు తన పాత వీడియోలను ఎడిట్ చేసి అటాచ్ చేయడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. “పది చెడ్డ కుక్కల కోసం 90 మంచి కుక్కలను చంపడం ఎంతవరకు సమంజసం?” అని తాను ప్రశ్నించినట్లు ఆమె క్లారిటీ ఇచ్చారు. కేవలం జంతువుల సంరక్షణ కోసం తాను ఎన్జీవో నడుపుతున్నానని, తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ దూషించే హక్కు ఎవరికీ లేదని ఆమె స్పష్టం చేశారు.
తమను తిట్టే వారు తమ ఇంట్లోని అక్కాచెల్లెళ్లకు, తల్లిదండ్రులకు తాము చేసే పనులను చూపించగలరా అని రేణు నిలదీశారు. దిగజారిన మనస్తత్వం ఉన్నవారు మాత్రమే ఇతరులపై ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తారని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాను విద్వేషం చిమ్మడానికి కాకుండా, బాధ్యతాయుతంగా ఉపయోగించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సైబర్ వేధింపులకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారి అసలు స్వరూపాన్ని వారి కుటుంబ సభ్యుల ముందే బయటపెడతానని రేణుదేశాయ్ హెచ్చరించారు.








