టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఈ సంక్రాంతికి పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యాక్షన్ సినిమాల నుంచి విరామం తీసుకుని, కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక హ్యూమరస్ సబ్జెక్టును ఎంచుకున్నారు. కథ విషయానికొస్తే.. ఇద్దరు భామల మధ్య నలిగిపోయే సగటు భర్త పడే ఇబ్బందులే ఈ సినిమా మూలకథ. రామ్ సత్యనారాయణ (రవితేజ) తన వైన్ బిజినెస్ పని మీద స్పెయిన్ వెళ్లి, అక్కడ మానస (ఆషికా రంగనాథ్)తో ప్రేమలో పడటం, అప్పటికే ఇండియాలో అతనికి బాలామణి (డింపుల్ హయాతీ)తో పెళ్లై ఉండటం.. ఈ కన్ఫ్యూజన్ డ్రామా చుట్టూ కథ ఆసక్తికరంగా సాగుతుంది.
సినిమా ప్రథమార్థం (First Half) అంతా వినోదభరితంగా సాగిపోతుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్, సత్య, సునీల్‌ల కామెడీ టైమింగ్ సినిమాకు పెద్ద అసెట్ అని చెప్పాలి. స్పెయిన్ నేపథ్యంలో వచ్చే సీన్లు, ఆ తర్వాత హైదరాబాద్‌లో భార్య, ప్రియురాలి మధ్య హీరో పడే పాట్లు థియేటర్లో నవ్వులు పూయిస్తాయి. చాలా కాలం తర్వాత రవితేజను పూర్తిస్థాయి కామెడీ రోల్‌లో చూడటం అభిమానులకు కనువిందుగా ఉంది. సెకండాఫ్‌లో కథ కొంత సీరియస్‌గా మారినప్పటికీ, దర్శకుడు ఎక్కడా బోర్ కొట్టకుండా జాగ్రత్త పడ్డారు. క్లైమాక్స్ రొటీన్‌గా అనిపించినా, పండగ పూట ఫ్యామిలీతో కలిసి చూసేందుకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇందులో పుష్కలంగా ఉంది.
నటీనటుల విషయానికి వస్తే రవితేజ తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో సినిమాను భుజాన వేసుకున్నారు. సునీల్ తో ఆయన కెమిస్ట్రీ, ముఖ్యంగా ‘కిరసనాయిల్’ ట్రాక్ బాగా పేలింది. హీరోయిన్లు ఆషికా రంగనాథ్ గ్లామర్‌తో, డింపుల్ హయాతీ తన నటనతో మెప్పించారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం, ముఖ్యంగా మాస్ సాంగ్ పండగ మూడ్‌కు సరిగ్గా సెట్ అయింది. మొత్తానికి, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పాత కథే అయినప్పటికీ, కిషోర్ తిరుమల తనదైన హాస్యంతో సంక్రాంతి బరిలో ఒక మంచి టైమ్ పాస్ మూవీగా నిలిపారు.









