శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా రేపు (జనవరి 14) విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో సీనియర్ నటుడు నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సామజవరగమన’ చిత్రంతో తనలో 2.0 వెర్షన్‌ను చూశారని, ఈ సినిమాతో తనలోని ‘నరేశ్ 3.0’ వెర్షన్‌ను ప్రేక్షకులు చూస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన కెరీర్‌లో ఇది ఒక బెస్ట్ రోల్ అని, థియేటర్‌కు వచ్చిన ప్రతి ఒక్కరూ కడుపుబ్బ నవ్వుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలో నరేశ్ పాత్రకు రెండో పెళ్లి జరుగుతుంది, దీని చుట్టూనే కామెడీ కథనం సాగుతుంది. ప్రెస్ మీట్‌లో దీనిపై స్పందిస్తూ.. “సినిమాలో నా పాత్రకు మళ్లీ పెళ్లి అవుతుంది, ఆ ఫన్‌ను అందరూ ఎంజాయ్ చేస్తారు. అయినా మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఈ కాలంలో ఎంతమంది మళ్లీ పెళ్లిళ్లు చేసుకోవడం లేదు?” అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజ జీవితంలో కూడా నరేశ్ వ్యక్తిగత జీవితంపై తరచూ చర్చ జరుగుతుండటంతో, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ గారి సినిమాల్లో ఉండే స్వచ్ఛమైన హాస్యం ఈ చిత్రంలో కనిపిస్తుందని నరేశ్ కొనియాడారు. సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతుందని, సంక్రాంతి పండుగ వేళ ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.









