బాలీవుడ్ సీనియర్ నటి జయా బచ్చన్ తన సినీ జీవితంలో 14 సంవత్సరాలు విరామం తీసుకోవడానికి గల కారణాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ నిర్ణయం ఆమె వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ఆమె కూతురు శ్వేతా బచ్చన్ పెంపకం కోసం తీసుకున్నారు.
1981లో ‘సిల్సిలా’ చిత్రం తర్వాత విరామం తీసుకున్న జయ, ఒక రోజు షూటింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, చిన్నారి శ్వేత వచ్చి “అమ్మా, నువ్వు పనికి వెళ్లొద్దు, నాన్నను మాత్రమే వెళ్లమను” అని అడిగిందని తెలిపారు. ఆ మాట వినగానే, తన కూతురు పెంపకంలో తల్లి తోడు ఎంత అవసరమో అర్థమై వెంటనే సినిమాలకు దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వివరించారు.
అయితే, తిరిగి సినిమాల్లోకి రావడానికి కూడా తన కూతురే కారణమని జయా బచ్చన్ పేర్కొన్నారు. శ్వేతకు వివాహమై అత్తారింటికి వెళ్ళిపోయాక ఇంట్లో కలిగిన ఒంటరితనం, బాధను జయించడానికి, ఆ ఎమోషనల్ గ్యాప్‌ను పూరించడానికి మళ్లీ నటన వైపు వచ్చానని తెలిపారు. ఆమె 1995లో ‘డాటర్స్ ఆఫ్ ది సెంచరీ’ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు.








