తెలుగులో మంచి మార్కెట్ కలిగిన తమిళ హీరో కార్తీ తన తాజా చిత్రం ‘వా వాతియార్’ ను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి తెలుగు ప్రమోషన్స్‌లో భాగంగా, తాజాగా మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలుగు టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. తమిళంలో ‘వా వాతియార్’ పేరుతో వస్తున్న ఈ సినిమా తెలుగులో ఆడియన్స్‌కు సులభంగా కనెక్ట్ అయ్యేలా ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
కార్తీ ఎప్పుడూ తన డబ్బింగ్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా టైటిల్స్‌ను ఎంచుకోవడంలో ముందుంటారు. అలాగే, సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయినా విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. ముందుగా డిసెంబర్ 5న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించినా, ఇప్పుడు ఆ తేదీకి వాయిదా పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. విడుదల తేదీని పేర్కొనకుండా “డిసెంబర్ రిలీజ్” అని పోస్టర్‌లో ఉండటంతో, క్రిస్మస్ సీజన్‌లో వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
‘అన్నగారు వస్తారు’ సినిమాలో కార్తీకి జోడీగా కృతి శెట్టి నటిస్తోంది, సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు. తమిళ వెర్షన్‌లో కార్తీ లెజెండరీ యాక్టర్ ఎంజీఆర్ అభిమానిగా కనిపించనున్నారని సమాచారం. అయితే, తెలుగు వెర్షన్ ‘అన్నగారు వస్తారు’ లో కూడా ఎంజీఆర్ అభిమానిగా చూపిస్తారా లేక ఇక్కడి దిగ్గజ నటుడు ఎన్టీఆర్ ఫ్యాన్‌గా మారుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల పరభాషా సినిమాలకు తెలుగు నేటివిటీకి దూరంగా ఉండే టైటిల్స్ వస్తున్న నేపథ్యంలో, కార్తీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రేక్షకులు స్వాగతిస్తున్నారు.









