పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక ప్రధాన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందడుగు వేశారు. శుక్రవారం దేవాదాయ శాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో, నియోజకవర్గంలోని ఆలయాల సమగ్ర అభివృద్ధికి రూ. 20 కోట్ల నిధులను మంజూరు చేసేందుకు సూత్రప్రాయంగా ఆమోదం లభించినట్లు ఆయన ప్రకటించారు.
ఈ నిధులను కామన్ గుడ్ ఫండ్ నుంచి విడుదల చేయనున్నారు. వీటి ద్వారా జీర్ణావస్థకు చేరిన 19 ఆలయాల పునర్నిర్మాణం, పునరుద్ధరణ పనులను చేపట్టాలని నిర్ణయించారు. అష్టాదశ శక్తి పీఠాలలో పదవ శక్తిపీఠం
శ్రీ పురుహూతికా అమ్మవారి ఆలయం,శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంతో సహా పలు పురాతన దేవాలయాలకు ఈ అభివృద్ధి పనులలో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ఈ నిధులతో జీర్ణావస్థకు చేరిన పలు ఆలయాలు పునర్నిర్మాణం సహా వివిధ ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం మండపాలు, మరియు మౌలిక వసతులు నిర్మాణం జరుగుతుందన్నారు.
ఈ సమగ్ర ప్రణాళికలో భాగంగా, పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఉమాకుక్కుటేశ్వర స్వామి ఆలయ సమగ్ర అభివృద్ధికి ఆరు కోట్ల రూపాయలు మంజూరి అయ్యాయని వాటితో ఆలయంలో అన్నదాన,పిండ ప్రధాన మండపాలు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. పట్టణంలోని శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానంలో రెండు కోట్ల రూపాయలు తో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. పట్టణంలోని అతి పురాతన ఆలయం శ్రీ సీతారామాంజనేయ స్వామి గుడికి 60 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. కోటగుమ్మం సెంటర్‌లో వేంచేసి ఉన్న జై గణేష్ స్వామి వారి ఆలయానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రూ. 65 లక్షల నిధులు కేటాయించారు. చిత్రాడ గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి 70 లక్షల రూపాయలు మంజూరి అయ్యాయి అన్నారు. ధూప దీప నైవేద్యం పథకంలోకి పలు ఆలయాలు నవఖండ్ర వాడలో గల నక్కుల్లమ్మ ఆలయం అదే గ్రామంలో గల రామాలయం. గొల్లప్రోలు శ్రీ సిరితల్లి ఆలయం. తాటిపర్తి శ్రీ మార్కండేయ సహిత భావన ఋషి స్వామి వారి ఆలయం.ఈ నిధులు ఆలయ పునర్నిర్మాణం మరియు ఆధునీకరణ పనులకు ఉపయోగపడతాయి.
ఈ నిర్ణయంపై స్థానిక భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే అన్ని ఆలయాల అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని, పిఠాపురం యొక్క ఆధ్యాత్మిక వైభవాన్ని పునరుజ్జీవింపజేయాలనేది తన లక్ష్యమని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.









