‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా ప్రదర్శన అనంతరం ఒక అమ్మాయి చున్నీ తీసివేయడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్ వచ్చిన నేపథ్యంలో, ఆ అమ్మాయికి మద్దతుగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గట్టిగా స్పందించారు. ఈ ఘటన పీఆర్ స్టంట్ కాదని, సినిమా చూసిన తర్వాత ఆ అమ్మాయి తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తపరచిందని రాహుల్ రవీంద్రన్ స్పష్టం చేశారు.
ఆ అమ్మాయిపై జరుగుతున్న ట్రోలింగ్ శృతి మించిపోతోందని, ఆమెను పదేపదే టార్గెట్ చేయడం సరికాదని రాహుల్ రవీంద్రన్ అన్నారు. థియేటర్‌కు ఎక్కడికి వెళ్తామో తమకు ముందే ఐడియా లేదని, కాబట్టి ఇదంతా పబ్లిసిటీ లేదా పీఆర్ స్టంట్ కాదని ఆయన ఖండించారు. సినిమా చూసిన తర్వాత తనకు కూడా ధైర్యంగా చున్నీ తీసేసి తన అభిప్రాయాన్ని చెప్పాలని ఉందని ఆ అమ్మాయి ఆనందంగా చెప్పిందని, ఆ వీడియోను పోస్ట్ చేసుకోవడానికి ఆమెకు ఎలాంటి అభ్యంతరం లేదని తమ టీమ్ నిర్ధారించుకుందని ఆయన తెలిపారు.
మహిళల పట్ల సమాజంలో ఉన్న ద్వంద్వ వైఖరిని రాహుల్ ప్రశ్నించారు. ఓ అమ్మాయి తన భావాలు చెప్పడానికి ప్రతీకగా చున్నీ తీసేస్తే కొందరు తట్టుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. అదే హీరోలు సినిమాల్లో ఫైట్ చేసే ముందు చొక్కా గుండీలు తీయడం, లేదా మగవాళ్ళు ఆట గెలిస్తేనో, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లోనో చొక్కాలు విప్పేయడం లాంటివి ఎందుకు తప్పుగా కనిపించవని ప్రశ్నించారు. సంస్కృతి, సంప్రదాయం అంటూ మహిళల మీదే ఎందుకు నియమాలు రుద్దుతారని ఆయన ప్రశ్నించారు. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ లాంటి సినిమా ప్రస్తుత ట్రెండ్‌కు, తరానికి అవసరం అని చాలామంది అనడం, ఈ ట్రోలింగ్ చూస్తుంటేనే ఎందుకో అర్థమవుతుందని రాహుల్ రవీంద్రన్ అభిప్రాయపడ్డారు.









