టాలీవుడ్ దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు తన సినిమాలకు సూపర్ హిట్ పాటలు అందించిన రచయిత ఆత్రేయపై ఒక సందర్భంలో సీరియస్ అయ్యారనే ఆసక్తికర విషయాన్ని దర్శకుడు కనకాల జయకుమార్ తాజాగా ‘తెలుగు వన్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సంఘటన అక్కినేని సొంత చిత్రం ‘శ్రీరంగనీతులు’ షూటింగ్ సమయంలో జరిగింది. ఈ సినిమాలో నాగేశ్వరరావు సరసన శ్రీదేవి నాయికగా నటించగా, కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు మరియు చక్రవర్తి సంగీత దర్శకుడిగా పనిచేశారు.
ఈ సినిమాలోని ఒక పాట రాయడం కోసం ఆత్రేయగారిని పిలిపించారు, అప్పుడు జయకుమార్ ఆ సినిమాకు కో-డైరెక్టర్‌గా ఉన్నారు. ఆత్రేయ అశోక హోటల్లో బస చేశారు. సంగీత దర్శకుడు చక్రవర్తి ఒక్క రోజులోనే పాట ట్యూన్‌ను కట్టేశారు. అయితే, ఆత్రేయగారు మాత్రం పాట రాయడానికి చాలా సమయం తీసుకున్నారు. వారం రోజులు గడిచినా పాట ఏమీ రాయకపోవడంతో, నాగేశ్వరరావుగారికి కోపం వచ్చిందట. దాంతో ఆయన “ఇక మద్రాస్ వెళ్లిపోవచ్చు” అని కోపంగా అన్నారని జయకుమార్ వివరించారు.
నాగేశ్వరరావు అలా అనగానే ఆత్రేయ హోటల్‌కి తిరిగి వచ్చేశారు. కనీసం పాట పల్లవి అయినా రాయమని కోదండరామిరెడ్డి ఆత్రేయను బ్రతిమాలారు. ఒక నిద్ర తీసిన తర్వాత ఆత్రేయ, జయకుమార్‌ను పిలిచి పల్లవి చెప్పి రాయమన్నారట. అలా ఆత్రేయ రాసినదే సూపర్ హిట్ పాట ‘కళ్లు ఓకే .. నడుము ఓకే .. నడక ఓకే’. ఉదయాన్నే ఆ పాటను అక్కినేని నాగేశ్వరరావుగారికి తీసుకెళ్లి ఇవ్వడంతో ఆయన కూల్ అయ్యారని జయకుమార్ తెలిపారు.









