దక్షిణాది చిత్ర పరిశ్రమకు ప్రస్తుతం లభిస్తున్న ఆదరణ పట్ల నటి ప్రియమణి తీవ్ర సంతోషాన్ని వ్యక్తం చేశారు. గతంలో మంచి చిత్రాలు వచ్చినా సరైన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, ఇప్పుడు ప్రాంతీయ చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తుండటం తనకు గర్వకారణంగా ఉందని తెలిపారు. ప్రాంతీయ, హిందీ చిత్రాల మధ్య ఉన్న అడ్డుగోడలు నెమ్మదిగా తొలగిపోతున్నాయని, భవిష్యత్తులో ఈ సరిహద్దులు పూర్తిగా చెరిగిపోవాలని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ.. ఎప్పటినుంచో దక్షిణాదిలో అద్భుతమైన చిత్రాలు రూపొందుతున్నప్పటికీ, గతంలో వాటికి సరైన ప్రాధాన్యత దక్కేది కాదని అన్నారు. కానీ ఇప్పుడు అలాంటి చిత్రాలే భారీ విజయాలు సాధిస్తుండటం నిజంగా గొప్ప విషయమని, ప్రేక్షకులు ఇప్పుడు దక్షిణాది సినిమాలను చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. సినిమాలతో పాటు వాటి వెనుక ఉన్న దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణుల గురించి కూడా చర్చించుకోవడం పరిశ్రమకు ఎంతో మంచిదని ప్రియమణి అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తెలుగులో ఆమె చివరిగా ‘కస్టడీ’ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం హిందీ, తమిళ భాషల్లో నటిస్తున్న ఆమె, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న పాపులర్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్-3’లో కీలక పాత్రలో కనిపించనున్నారు.









