నందమూరి హీరో కళ్యాణ్ రామ్ విభిన్న చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2022లో ‘బింబిసార’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నా, ఆ తర్వాత వచ్చిన ‘అమిగోస్’, ‘డెవిల్’, ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ వంటి చిత్రాలు పరాజయాలు చవిచూశాయి. దీంతో ఆయన కెరీర్ కొంత తడబడుతోంది. ఈ నేపథ్యంలో, కొంత విరామం తీసుకున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై దృష్టి సారించారు.
తాజా సమాచారం ప్రకారం, కళ్యాణ్ రామ్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటిలో ఒకటి సూపర్ హిట్ అయిన ‘బింబిసార’కు సీక్వెల్‌గా రాబోతున్న ‘బింబిసార 2’ కాగా, మరొకటి కొత్త దర్శకుడితో తెరకెక్కనుంది. ఆ కొత్త దర్శకుడు మరెవరో కాదు, పలు హిట్ సినిమాలకు రైటర్‌గా పేరుపొందిన శ్రీకాంత్ విస్సా. శ్రీకాంత్ విస్సా చెప్పిన కథ కళ్యాణ్ రామ్‌కి బాగా నచ్చడంతో, వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 2026లో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఇక ‘బింబిసార 2’ విషయానికి వస్తే, మొదటి భాగం మాదిరిగానే క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యాధిపతి బింబిసారుడి కథ ఆధారంగా ఈ సీక్వెల్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించనున్నారు. ‘బింబిసార’ విజయాన్ని మరింత పెద్ద స్థాయిలో కొనసాగించేలా ‘బింబిసార 2’ ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాదిలో మొదలుపెట్టి 2026లో విడుదల చేయాలని టీమ్ యోచిస్తోంది. ‘బింబిసార 2’తో పాటు కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడం ద్వారా కళ్యాణ్ రామ్ కొత్త కథలను ప్రోత్సహించే హీరోనని మరోసారి నిరూపించుకోబోతున్నారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.









