పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమా ఆడియో టీజర్ విడుదల సందర్భంగా, బాలీవుడ్ నటి దీపికా పదుకొణె పేరుతో వచ్చిన ఒక నకిలీ ట్వీట్ తీవ్ర గందరగోళానికి దారితీసింది. ప్రభాస్ పుట్టినరోజున మేకర్స్ టీజర్‌ను విడుదల చేయగా, “‘స్పిరిట్’ వీడియో అద్భుతంగా ఉంది… కానీ నేను బాధగా ఉన్నాను సందీప్ రెడ్డి. ప్రభాస్ సర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ ఒక ఫేక్ ఎక్స్ ఖాతా నుంచి పోస్ట్ ప్రత్యక్షమై క్షణాల్లో వైరల్ అయ్యింది.
దీపికా పదుకొణె ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాల నేపథ్యంలోనే ఈ ఫేక్ ట్వీట్‌ను చాలామంది నమ్మారు. వాస్తవానికి, మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొణెను సంప్రదించారు. అయితే, ఆమె అధిక పారితోషికం, లాభాల్లో వాటా, పరిమిత పని గంటలు వంటి కఠినమైన డిమాండ్లు పెట్టడంతో ప్రాజెక్ట్ నుంచి ఆమెను తప్పించి, ఆ స్థానంలో ‘యానిమల్’ ఫేమ్ తృప్తి డిమ్రిని హీరోయిన్‌గా తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే, ఆమెను సినిమా నుంచి తొలగించినందుకు బాధపడుతున్నట్లు ఉన్న ఈ ఫేక్ ట్వీట్‌ను కొందరు ఆకతాయిలు సృష్టించారు.
ఇక, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘స్పిరిట్’ నుంచి ‘సౌండ్-స్టోరీ’ పేరుతో ఒక ఆడియో క్లిప్‌ను ఐదు భాషల్లో విడుదల చేశారు. దాదాపు నిమిషం నిడివి ఉన్న ఈ ఆడియోలో, రిమాండ్‌లో ఉన్న మాజీ పోలీస్ అధికారిని సాధారణ ఖైదీలా చూడాలని, బట్టలు విప్పి తనిఖీ చేయాలని జైలర్ ఆదేశాలు ఇవ్వడం ఉత్కంఠను రేపుతోంది. ఈ ఆడియో క్లిప్ ద్వారానే సినిమాలో ప్రభాస్‌తో పాటు తృప్తి డిమ్రి, కాంచన, ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్ వంటి నటీనటులు ఉన్నారని మేకర్స్ అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం ఈ ‘సౌండ్-స్టోరీ’ సినిమాపై అంచనాలను పెంచుతుండగా, మరోవైపు ఈ నకిలీ ట్వీట్ సోషల్ మీడియాలో అనవసర చర్చకు దారితీసింది.









