పార్టీ మీద విపరీతమైన అభిమానం, పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ఇష్టం ఉన్న కొందరు ఈ మధ్యకాలంలో అవగాహన లేకుండా ఆవేశంతో సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారని నాదేండ్ల అన్నారు. ఇది నిజంగా బాధించే అంశం. అందరికీ తగిన గుర్తింపును ఇవ్వాలన్నదే పవన్ కళ్యాణ్ ఆలోచన అని వివరించారు. 14 నెలల కూటమి పాలనలో పాలనపరమైన అంశాలను తెలుసుకునేందుకు, దానిపై పూర్తిగా దృష్టి సారించేందుకు కాస్త సమయం పట్టింది. దానిని పట్టించుకోని కొందరు పార్టీ మీద ఇష్టానుసారం మాట్లాడటం మంచిది కాదని నాదేండ్ల హితవు పలికారు. పాలనలో పట్టు తెచ్చుకోవడం ప్రధానం.
ఏదైనా పథకం లేదా కార్యక్రమం చేయాలన్నా సామాన్యుడి పంథాలో ఆలోచించి ముందుకు వెళ్లడం పవన్ నైజమన్నారు. క్షేత్రస్థాయిలో ఆయన చూసిన సమస్యలు, వేదనలు అన్ని గుర్తుంచుకొని పథకాలకు, కార్యక్రమాలకు రూపకల్పన చేయడం పవన్ ప్రత్యేకత గా మనోహర్ చెప్పుకొచ్చారు. గత వైసీపీ హయాంలో ప్రజలంతా విసిగిపోయి కూటమి ప్రభుత్వానికి ఘన విజయం ఇచ్చారు.
అప్పటి అరాచక, అవినీతి పాలన ప్రజలందరికీ ఇప్పటికే గుర్తే. ఓ అహంకార పాలనకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతోనే వైసీపీని ఇంటికి పంపి, కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. ప్రజలు పెట్టుకున్న ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు వెళ్తూ పని చేస్తుంది. జనసైనికులు, వీర మహిళలు ఈ ప్రభుత్వం మనది.. మనందరిదీ అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలి. సామాజిక, వర్తమాన విషయాలు, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై విస్తృత అవగాహన పెంచుకోండని సూచించారు.
పవన్ మాటే మనందరికీ వేదం కావాలి
జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ మాటే నాయకులు, జనసైనికులు, వీర మహిళకు వేదం కావాలన్నారు. ఆయన అడుగులో అడుగు వేస్తూ, చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వింటూ ముందుకు వెళ్లాలని సూచించారు. క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదలతో సమష్టిగా కదలుదాం. అంకితభావంతో పార్టీ కార్యక్రమాలను నిర్వహిద్దామన్నారు. గతంలో పవన్‌తో మాట్లాడుకునే సమయంలో జనసేన పార్టీ ప్రస్థానం పదవుల కోసమో, అధికారం కోసమో కాదని స్పష్టంగా అనుకునేవాళ్లమని గుర్తు చేశారు.
ఈ ప్రయాణం దేశం కోసం, దేశానికి అవసరమయ్యే నిజాయతీ గల నాయకత్వాన్ని అందించడం కోసమని భావించాం. ఒకే మాట మీద కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు నిలబడదాం. 12.34 లక్షల క్రియాశీలక సభ్యత్వాన్ని పార్టీకి అందించిన గొప్ప యంత్రాంగం మనకుందంటూ మనోహర్ చెప్పుకొచ్చారు. దీన్ని మరింతగా విస్తృతం చేద్దాం కూటమి స్ఫూర్తిని నిలబెట్టి, కూటమిలోని ఇతర పార్టీల నాయకులను గౌరవిద్దాం. మనం గౌరవం పొంది మన నాయకుడికి తోడునీడగా నిలుద్దాం’’ అంటూ ముగించారు.