జనసేన పవన్ కళ్యాణ్ ఆయన ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి. గత ఎన్నికల్లో ఎంతో కష్టించి, త్యాగం చేసిన ఫలితంగా కూటమి ప్రభుత్వం నిలబడటానికి పవన్ ప్రధాన కారణమనేది అందరికీ తెలిసిందే. అందుకే ఆయనను మోడీ సైతం తుఫాన్ తో పోల్చారు. పవన్ ఒక్క ఆలోచన రాష్ట్ర భవిష్యత్తు మారే దిక్సూచి అయ్యిందనేది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం పవన్ విశాఖ పట్నం వేదికగా సేనతో సేనాని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు విశాఖపట్నంలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన నాయకత్వంతోపాటు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటి అయ్యారు. ఈసందర్బంగా ఆయన జనసేన పోరాటాలను ఒకసారి గుర్తు చేశారు. శ్రీకాకుళం వద్ద ఉద్ధానం కిడ్నీసమస్య దగ్గర నుండి, గత ప్రభుత్వ అక్రమాలు, అన్యాయాలపై చేసిన పోరాటాలను నెమరవేసుకున్నారు ఎవరిపైనో బాధ్యత పెట్టేసి వదిలించుకోవడం కాదని, జనసేన సైన్యమే తనను నడిపిస్తోందని పవన్ అన్నారు. సుదీర్ఘంగా లక్ష్యాలు ఉన్నప్పటికీ వాటిని సాధించే భావజాలం జనసేన పార్టీ సమూహానికి ఉంది. చాలామంది రాజకీయ పండితులు పార్టీ సిద్ధాంతాలు చూసి, వీటివల్ల ఓట్లు వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. ఒక కులం ఆధారంగా లేదా మతం ఆధారంగా, ప్రజల భావోద్వేగ సమస్యను తీసుకొని సిద్ధాంతాలుగా పెడితేనే బాగుంటుందని పవన్ సూచించారు.
ఇష్టం లేకపోయినా..సినిమాలే ఆధారం
జనసేన పార్టీ నడిపించాలంటే చాలా శక్తి కావాలని, గతం మాదిరిగా పరిస్థితి లేదన్నారు. సినిమాలు ఇష్టం లేకపోయినా సినిమాలే ఆధారమని పవన్ అన్నారు. తన పోరాట యాత్రలో భాగంగా సినిమాలు మానేద్దామని భావించానన్నారు. అయితే తర్వాత తన సిద్ధాంతాలు, భావజాలాన్ని బతికించుకోవాలంటే జనసేన పార్టీ ప్రయాణం ఖచ్చితంగా ఉండాలని నిర్ణయించుకొని, పార్టీని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో సినిమాలు తప్పనిసరి చేసుకోవాల్సి వచ్చిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గుర్తించిన తర్వాతే చాలామందికి పవన్ కళ్యాణ్ అంటే నమ్మకం వచ్చిందన్నారు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి పరిస్థితులు, అప్పటి రాజకీయ పరిస్థితులు వేరుగా ఉండేవని గుర్తు చేశారు. ప్రతి కష్టం తనను కదిలించిందన్న పవన్ ఎన్నో వేదనలు, అవమానాలు, అవహేళనలు జయించి ముందుకు నడిచానన్నారు.. ఈ ప్రయాణంలో ప్రతి అడుగున తోడు ఉంది జనసైనికులు, వీర మహిళలేనని పవన్ చెప్పుకొచ్చారు. కష్ట కాలం వచ్చినప్పుడే తన చుట్టూ ఉండేవాళ్లా..పరాయివాళ్లా అనేది తెలుస్తోందన్నారు