కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమాపై పూర్తి దృష్టి పెట్టారు. ఆగస్టు 14న విడుదల కాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న లోకేశ్, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను షేర్ చేశారు.
ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలకమైన విలన్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేసే నాగార్జునను నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు ఎలా ఎంపిక చేశారనే ప్రశ్నకు సమాధానంగా, “నాగార్జున సార్‌కి నేను చిన్ననాటి నుంచి పెద్ద అభిమానిని. ఆయన నటించిన ‘రక్షకుడు’ సినిమా నా ఫేవరెట్. ఆ సినిమాలోని హెయిర్ స్టైల్‌కి ఇన్స్పైర్ అయి నేను కూడా అదే తరహాలో కటింగ్ చేయించుకున్నాను. ‘శివ’, ‘గీతాంజలి’, ‘అన్నమయ్య’ సినిమాలన్నీ నాకు చాలా ఇష్టమైనవే,” అంటూ తన అభిమానాన్ని వ్యక్తపరిచారు లోకేశ్.
అలాగే, నాగార్జునను ‘కూలీ’లో విలన్‌గా ఒప్పించేందుకు ఎంత కష్టపడ్డారో చెప్పకనే వుండలేరు.
“ఒకసారి డిఫరెంట్‌గా ప్రయత్నించండని అడిగాను. కానీ వెంటనే అంగీకరించలేదు. దాదాపు ఏడుసార్లు వెళ్లి మాట్లాడాకే ఆయన ఒప్పుకున్నారు. ఆయనంత రేంజ్లో ఉన్న స్టార్‌ను కొత్త కోణంలో చూపించడం నా కోరిక. ఈ సినిమా ద్వారా నాగ్ సార్‌ను ప్రేక్షకులు ఓ కొత్త అవతారంలో చూస్తారు,” అని చెప్పారు లోకేశ్..