ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఇటీవల ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసానికి గురయ్యారు. డబ్బులు ముందుగానే చెల్లించినా, ఆర్డర్ చేసిన వస్తువులు రాకపోవడాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
“ట్రపుల్ ఇండియా”పై తీవ్ర విమర్శలు
ఒక నెల క్రితం “ట్రపుల్ ఇండియా” అనే క్లాతింగ్ వెబ్‌సైట్ ద్వారా కొన్ని దుస్తులు ఆర్డర్ చేశానని, వాటికి సంబంధించిన మొత్తం ముందే చెల్లించానని అనసూయ తెలిపారు. కానీ నెల రోజులైనా డెలివరీ జరగలేదని, తాను సంప్రదించినా అక్కడి నిర్వాహకుల నుంచి స్పందన రాలేదని ఆరోపించారు. పైగా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని ఆమె మండిపడ్డారు.ఈ విషయంలో మొదట స్పందించకూడదని అనుకున్నానని, కానీ మరెవ్వరూ తనలాగే మోసపోవద్దన్న ఉద్దేశంతోనే ఈ పోస్ట్ చేశానని అనసూయ పేర్కొన్నారు. “సొంతంగా దుస్తులు అమ్ముతున్నట్టు నటిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు” అంటూ ట్రపుల్ ఇండియా నిర్వాహకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అనసూయకు మద్దతుగా నిలుస్తున్నారు. “అయ్యో పాపం”, “ఇలాంటి మోసాల గురించి ముందే చెప్పడం మంచిదే” అంటూ కామెంట్లు చేస్తున్నారు.