నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈయన.. ‘జాతిరత్నాలు’అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రంతో భారీ పాపులారిటీ అందుకున్నారు. చివరిగా అనుష్క శెట్టి (Anushka Shetty) తో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చేసి భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. ఆ తర్వాత ఆక్సిడెంట్ కి గురై కొద్ది రోజులు ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలో విభిన్నమైన కథలను విన్న నవీన్ పోలిశెట్టి ఇప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే.
అనగనగా ఒకరాజుతో రాబోతున్న నవీన్..
ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary) ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar) ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో.. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamshi) , త్రివిక్రమ్(Trivikram ) సతీమణి సాయి సౌజన్య (Sai Soujanya) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతి టార్గెట్ గా.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది. అంతేకాదు ఇప్పుడు సినిమా నుండి వరుస అప్డేట్స్ ఇస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు మేకర్స్.
మణిరత్నం దర్శకత్వంలో నవీన్ ఫ్రెష్ లవ్ స్టోరీ..
ఇక ఈ విషయం కాస్త పక్కన పెడితే.. ఇప్పుడు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఒక అందమైన ప్రేమ కథ కోసం కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) తో జత కట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే మణిరత్నం బృందం నవీన్ పోలీశెట్టిని సంప్రదించగా.. ఆయన కూడా ఫ్రెష్ లవ్ స్టోరీ కావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికైతే ఈ విషయం గురించి తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ నుంచి వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం మణిరత్నం ‘థగ్ లైఫ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ (Kamal Hassan) హీరోగా నటిస్తున్నారు. ఈ సమ్మర్ స్పెషల్ గా జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే నవీన్ తో ఈ ఫ్రెష్ లవ్ స్టోరీ ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారట మణిరత్నం
మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు నిర్ధారణకు రాలేమని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
ఇదే నిజమైతే జాక్ పాట్ కొట్టినట్టే..
ఒకవేళ నవీన్ పోలిశెట్టి మణిరత్నం దర్శకత్వంలో గనుక సినిమా చేస్తే.. తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని, ఇక నవీన్ కెరీర్ కు తిరుగు ఉండదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఏది ఏమైనా నవీన్ మణిరత్నం డైరెక్షన్లో రాబోతున్నారు అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక నవీన్ పోలిశెట్టి విషయానికి వస్తే.. యాక్సిడెంట్ తర్వాత పూర్తిగా కోలుకున్న ఈయన ఇప్పుడు రాబోతున్న చిత్రంతో మళ్ళీ తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా నవీన్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.