Search
Close this search box.

  నన్ను తేలిగ్గా తీసుకోవద్దు.. ఫడ్నవీస్‌ను హెచ్చరించిన ఏక్‌నాథ్ షిండే.. లుకలుకలు బహిర్గతం..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే మధ్య అగాధం పెరుగుతోందన్న ఊహాగానాల నేపథ్యంలో తాజాగా షిండే చేసిన వ్యాఖ్యలు దీనిని బలపరిచాయి. తనను తేలిగ్గా తీసుకోవద్దంటూ ఆయన చేసిన హెచ్చరికలు కూటమిలో లుకలుకలను బయటపెట్టాయి. ఫడ్నవీస్ సమావేశాలకు దూరంగా ఉంటున్న షిండే.. తనను ఒకసారి తేలిగ్గా తీసుకున్నందుకు 2022లో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయిందని గుర్తు చేశారు.

 

షిండే సీఎంగా ఉన్న సమయంలో ఆమోదించిన రూ.900 కోట్ల జల్నా ప్రాజెక్టును ప్రస్తుత ముఖ్యమంత్రి ఫడ్నవీస్ నిలిపివేయడంతో పాటు దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో షిండే ఈ హెచ్చరికలు చేశారు. ‘‘నేనొక సాధారణ పార్టీ కార్యకర్తను. కానీ, నేను బాలా సాహెబ్ వద్ద కూడా పనిచేశాను. కాబట్టి ప్రతి ఒక్కరు దీనిని అర్థం చేసుకోవాలి. 2022లో నన్ను తేలిగ్గా తీసుకోవడంతో అప్పటి ప్రభుత్వం కుప్పకూలిపోయింది’’ అని షిండే పేర్కొన్నారు.

 

2022లో షిండే రెబల్‌గా మారి 40 మంది ఎమ్మెల్యేలతో శివసేన పార్టీని అడ్డంగా చీల్చేశారు. దీంతో అప్పటి మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పతనమైంది. ఆ తర్వాత ఆయన బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 288 స్థానాలకు గాను 230 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, సీఎం పదవిని షిండేకు కాకుండా దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఇవ్వడంపై ఆయన వర్గం నేతల్లో కూటమిపై వ్యతిరేకత మొదలైంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు