భాష విషయంలో తమిళనాడులో నెలకొన్న వివాదంపై ప్రముఖ తమిళ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) అధినేత కమల హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భాష విషయాన్ని తమిళలు తేలిగ్గా తీసుకోవాలని నొక్కి చెప్పారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం, కేంద్రం మధ్య భాష విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
ఎంఎన్ఎం 8వ వ్యవస్థాపక దినోత్సవంలో కమల హాసన్ మాట్లాడుతూ.. ‘‘భాష కోసం తమిళలు ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఇలాంటి వాటితో ఆడుకోవద్దు. తమకు ఏ భాష అవసరమో తమిళులు, ముఖ్యంగా చిన్నారులకు తెలుసు’’ అని పేర్కొన్నారు.
కొత్త విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో భాగంగా త్రిభాషా విధానాన్ని కేంద్రం అమలు చేయడాన్ని స్టాలిన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఇది బీజేపీ, డీఎంకే మధ్య వాగ్వివాదానికి కారణమైంది. ఎన్‌ఈపీ పేరుతో కేంద్రం తమపై హిందీని రుద్దేందుకు ప్రయత్నిస్తోందని స్టాలిన్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, గత ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమికి కమల హాసన్ పార్టీ మద్దతునిచ్చింది.