Search
Close this search box.

  దర్శకుడు శంకర్‌పై అలాంటి కేసు.. ఏకంగా రూ.10 కోట్ల ఆస్తులు జప్తు..

చాలావరకు తమిళ దర్శకులు నేరుగా తెలుగులో సినిమాలు చేయకపోయినా తమ డబ్బింగ్ సినిమాలతోనే తెలుగులో భారీ ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకున్నారు. పాన్ ఇండియా అనే ట్యాగ్ లేకపోతే అటు తమిళ, ఇటు తెలుగు ఆడియన్స్‌ను తమ సినిమాలతో ఆకట్టుకున్నారు. అలాంటి దర్శకుల్లో శంకర్ కూడా ఒకరు. శంకర్‌కు ఎంత భారీ ఫ్యాన్ బేస్ ఉందో ఆయన కెరీర్‌లో అన్నే వివాదాలు కూడా ఉన్నాయి. దాదాపు శంకర్ దర్శకత్వం వహించిన ప్రతీ సినిమా చుట్టూ ఏదో ఒక వివాదం తిరుగుతూనే ఉంటుంది. అలా ఆయన 2011లో తెరకెక్కించిన ‘రోబో’ మూవీపై కూడా ఒక వివాదం చలరేగింది. ఇప్పుడు దానివల్ల ఆయనకు భారీ ఆస్తి నష్టం కూడా కలిగింది.

 

‘రోబో’ తెచ్చిన తిప్పలు

 

శంకర్ (Shankar) దర్శకుడిగా పరిచయమయ్యి ఎన్నో ఏళ్లు అయినా చాలా తక్కువ సినిమాలే తెరకెక్కించారు. దానికి కారణం ఆయన విజన్ చాలా గ్రాండ్‌గా ఉండడమే. బలమైన కథతో, భారీ బడ్జెట్‌తో, గ్రాండ్ విజన్‌తో సినిమాలు తెరకెక్కించడమే శంకర్ స్పెషాలిటీ. అందుకే ఆయన రెండు, మూడేళ్లకు ఒకసారి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. అలా 2011లో రజినీకాంత్ (Rajinikanth) హీరోగా ‘రోబో’ మూవీని తెరకెక్కించారు. రజినీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో అదే మొదటి సినిమా. పైగా తమిళంలో అంత భారీ బడ్జెట్‌తో సైఫై మూవీని తీసి సాహసం ఏ దర్శకుడు చేయలేదు. ఆ సాహసాన్ని శంకర్ చేశారు. ఇప్పుడు అదే మూవీ తనకు తిప్పలు తెచ్చిపెట్టింది.

 

పోలికలు ఉన్నాయి

 

2011లో ‘రోబో’ (Robot) విడుదలయిన తర్వాత ప్రముఖ తమిళ రచయిత అయిన ఆరూర్‌ తమిళ్‌నందన్‌.. ఈ కథ తనదేనంటూ కేసు నమోదు చేశారు. అప్పటినుండి ఈ కేసు నడుస్తూనే ఉంది. ఈ విషయంలో శంకర్‌పై ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది. దీంతో ఈడీ.. ఈ కేసుపై విచారణ చేపట్టింది. ఆరూర్ రాసిన కథకు, రోబో కథకు నిజంగా పోలికలు ఉన్నాయా అని పరిశీలన మొదలుపెట్టింది. ఇన్నేళ్లుగా ఈ పరిశీలన కొనసాగుతూనే ఉంది. 1957 కాపీరైట్ చట్టం ప్రకారం సెక్షన్ 63 ఆధారంగా శంకర్‌పై కేసు నమోదయ్యింది. తాను ఏ ఆధారాలు లేకుండా శంకర్‌పై ఆరోపణలు చేయడం లేదని, తాను చెప్పిందంతా నిజమే అని ఆరూర్ బలంగా ఈ కేసు విషయంలో ఫైట్ చేస్తూ వచ్చారు. చివరికి గెలిచారు.

 

రెమ్యునరేషన్ జప్తు

 

ఆరూర్ తమిళ్‌నందన్ చేసిన ఆరోపణలు నిజమే అని ఈడీ తేల్చేసింది. దీంతో దర్శకుడు శంకర్‌కు సంబంధించిన రూ.10.11 కోట్ల ఆస్తులను జప్తు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. నిజంగానే ‘రోబో’ కథను కాపీ కొట్టారని, దానికి సంబంధించి అందించిన ఆధారాలు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయని ఈడీ తేల్చేసింది. కాపీరైట్ కేసును ఉల్లంఘించారంటూ శంకర్‌పై ఫైన్ వేసింది. ‘రోబో’ సినిమాను తెరకెక్కించడం కోసం శంకర్ రూ.11.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. కాబట్టి ఈ రెమ్యునరేషన్‌ను ఈడీ జప్తు చేయాలని నిర్ణయించుకుంది. అప్పట్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.290 కోట్లు వసూళ్లు చేసిందని ఈడీ చెప్పుకొచ్చింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు