ఉదయం నిద్రలేచినప్పటి నుంచి సాయంత్రం స్నేహితులతో టైంపాస్ దాకా.. చాలా మందిలో కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయమే ఉత్సాహం రావడానికి, మూడీగా ఉంటే రిలాక్స్ కావడానికి కాఫీ తోడ్పడుతుంది కూడా. అయితే కాఫీ వల్ల శరీరంలో రక్తపోటు పెరుగుతుందని చాలా మందిలో నమ్మకం ఉంది. ఇది కొంత వరకు వాస్తవం కూడా. అయితే కాఫీ తాగితే ఎంత మేర బీపీ పెరుగుతుంది? ఎవరిలో ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై నిపుణుల సూచనలివే..
కాఫీ తాగితే ఏమవుతుంది?
కాఫీలో ఉండే కెఫీన్ ఉత్తేజకర పదార్థం. ఇది మెదడు, నాడీ మండలాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఒక కాఫీ తాగినప్పుడు దాని ప్రభావం 30 నిమిషాల నుండి 2 గంటల వరకు ఉంటుంది. కాఫీ తాగినప్పుడు కెఫీన్ రక్తం ద్వారా శరీరంలో ప్రవేశించి వివిధ హార్మోన్లతో, న్యూరో ట్రాన్స్ మిటర్ల (నాడుల్లో రసాయన సంకేతాల)తో చర్య జరుపుతుంది. ఈ క్రమంలో రక్తనాళాలు స్వల్పంగా కుచించుకుని.. రక్తపోటు పెరుగుతుంది.
బీపీ పెంచినా.. తాత్కాలికమే..
కాఫీ రక్తపోటును పెంచినా అది తాత్కాలికమేనని నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) ఉన్న వారు, లేనివారు అందరిలోనూ ఈ ప్రభావం ఉంటుంది. అయితే వ్యక్తులను బట్టి, వారు కెఫీన్ ను ఎంత వరకు తట్టుకోగలరు, దానికి ఎంత ప్రభావితం అవుతారన్న దాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. తరచూ కాఫీ లేదా కెఫీన్ ఉన్న డ్రింక్స్ తాగేవారితో పోలిస్తే… అప్పుడప్పుడు తక్కువగా తాగేవారిలో రక్తపోటు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కాఫీ ఎఫెక్ట్ ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది?
కాఫీతో ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
కాఫీ తాగడం వల్ల తాత్కాలికంగా రక్తపోటు పెరిగినా.. దీర్ఘకాలికంగా అధిక రక్తపోటు ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
అధిక రక్తపోటు ఉన్నవారు కూడా కాఫీ తాగవచ్చని, అయితే అది మీ శరీరం కెఫీన్ కు అలవాటుపడి ఉన్న దాన్ని బట్టి ప్రభావం కనిపిస్తుందని వివరిస్తున్నారు.
రక్తపోటు చాలా అధికంగా (స్టేజ్ 2 లేదా 3 హైపర్ టెన్షన్) ఉన్నవారు కాఫీ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి వారు తరచూ కాఫీ తాగడం వల్ల హైబీపీ, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
సాధారణ రక్తపోటు ఉన్నవారికి రోజుకు 1 నుంచి 3 కప్పుల కాఫీ తాగడం శరీరానికి మేలు చేస్తుందని వివరిస్తున్నారు