ప్రపంచమంతా టెక్నాలజీమయంగా మారిపోయింది. ఒకప్పుడు ఇంట్లో నుంచి రోడ్డు పైకి వెళ్లాలంటే.. జేబులో డబ్బులు చూసుకునేవారు. స్మార్ట్‌ఫోన్ పుణ్యమాని అవేమీ అక్కర్లేకుండా పోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే అన్నీ సర్వీసులు పొందవచ్చు. ట్రెండ్‌కు తగ్గట్టుగా ఫాలో కాకుంటే వెనుకబడుపోతాం. అరచేతిలో విశ్వ విజ్ఞానాన్ని చూడగలుగుతున్న ప్రస్తుతం రోజుల్లో ప్రజలకు కొన్ని సేవలు అందని దాక్షగా ఉంది.
హెల్త్ సెక్టార్ మరో అడుగు
అందులో హెల్త్ సెక్టార్ కీలకమైంది. సరైన సమయంలో అంబులెన్సు రాక చాలా మంది చనిపోతున్న సందర్భాలు లేకపోలేదు. నిత్యం ఇండియాలో ఏదో ఒక దగ్గర అలాంటి పరిస్థితి చూస్తూనే ఉంటున్నాం. పట్టణాలు, నగరాల గురించి చెప్పనక్కర్లేదు. పెరిగిన ట్రాఫిక్ కారణంగా అంబులెన్స్‌లు ఆ రద్దీలో చిక్కుకున్న సందర్భాలు లేకపోలేదు. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. రన్‌వే అవసరం లేకుండా టేకాఫ్, ల్యాండయ్యే ఎయిర్ అంబులెన్సులు భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది భారత్‌లో ఎయిర్ అంబులెన్స్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
ఎయిర్ అంబులెన్సు సేవలందించే సంస్థ ఐసీఏటీటీ సంస్థ ఇప్లేన్ కంపెనీతో డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద 788 ఎయిర్ అంబులెన్సులను సరఫరా చేయనుంది. ఈ అంబులెన్సులు కేవలం రోడ్డు మీద టేకాఫ్,ల్యాండింగ్ అవుతాయి. దేశంలోని ప్రతి జిల్లాలో అందుబాటులో ఉంచాలన్నది ఆ కంపెనీ ఆలోచన.
టార్గెట్ 2026
అంతా అనుకున్నట్లు జరిగితే 2026 చివరి నాటికి ఎయిర్ అంబులెన్సులను సరఫరా చేయాలన్నది ఈ-ప్లేన్ సంస్థ ప్లాన్. జన సాంద్రత ప్రదేశాల్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా మూడు రకాల ప్రోటోటైప్‌లను రూపొందించనుంది. ఎయిర్ అంబులెన్సులో పైలట్, పారామెడిక్, పేషెంట్, స్ట్రెచర్, అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయి.
ఎయిర్ అంబులెన్సుల ప్రత్యేకత
ఇవి గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఒక్కసారి ఛార్జ్‌తో 110-200 కిలోమీటర్ల దూరం వెళ్లనున్నాయి. ఐఐటీ మద్రాస్ కేంద్రంగా పని చేస్తోంది ఈ-ప్లేన్ కంపెనీ. ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ స్టార్టప్ ఈ మేరకు దేశంలో ఎయిర్ అంబులెన్స్ సంస్థ ఇంటర్నేషనల్ క్రిటికల్-కేర్ ఎయిర్ ట్రాన్స్‌ఫర్ టీమ్‌తో 100 కోట్ల డాలర్ల మేరా ఒప్పందం చేసుకుంది. దీని విలువ అక్షరాలా సుమారు రూ.8,700 కోట్లన్నమాట.
తమ సంస్థకు ఏడాదికి 100 యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నది కంపెనీ ఫౌండర్ సత్య చక్రవర్తి మాట. చక్రవర్తి మద్రాస్ ఐఐటీలో ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. ఎయిర్ అంబులెన్స్‌ల ఒప్పందం పూర్తయినప్పటికీ, అవసరమైన సర్టిఫికేషన్ పొందేందుకు మరో 10 కోట్ల డాలర్ల నిధులను ఆయన ఆశిస్తున్నారు. ఈ కంపెనీ 2 కోట్ల డాలర్లను పెట్టుబడిదారుల నుంచి సేకరించింది.
2026 చివరి నాటికి ఎయిర్ అంబులెన్స్‌ల కార్యకలాపాలు ప్రారంభించాలని ఈ-ప్లేన్ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి సర్వీసు ఉన్నాయి. కొన్నాళ్లు కిందట చైనా ఇలాంటి సర్వీసులను ప్రారంభించింది. ఆ తర్వాత సక్సెస్ అయ్యింది. ఈ తరహా అంబులెన్స్‌లను ప్రారంభించిన ప్రపంచంలో కొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా చేరనుంది. దాదాపు 95 శాతం మంది సకాలంలో అవయవాలు పొందక మరణిస్తున్నారు. అతి తక్కువ సమయంలో అవయవాలు, ఔషధాలను తరలించేందుకు ఇవి ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి. ఈ లెక్కన రాబోయే రోజుల్లో పైలట్లకు మంచి డిమాండ్ ఉండడం ఖాయం.