Search
Close this search box.

  నన్ను ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదు.. అజింక్య రహానే ఆవేదన..

భారత జట్టు నుంచి తనను తప్పించడంపై టీమిండియా స్టార్ ప్లేయర్ అజింక్య రహానే ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) గత ఫైనల్‌లో బాగానే ఆడానని, అయినా ఎందుకు తప్పించారో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నాడు. జట్టు ఎంపిక అనేది సెలక్టర్ల పని అని, తాను మాత్రం బాగానే ఆడానని అనుకుంటున్నానని చెప్పాడు. అప్పుడు సెంచరీ కూడా చేశానని గుర్తు చేసుకున్నాడు. అయితే, జాతీయ జట్టులో అవకాశం కోల్పోయినప్పుడు దేశవాళీ క్రికెట్ తనను ఆదరించిందన్నాడు. కాబట్టి దాని కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశాడు.

 

టెస్టు క్రికెట్ అంటే తనకు ఎంతో ఇష్టమని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనని పేర్కొన్న రహానే.. భారత జట్టులోకి తిరిగి రావడంపై ఆశాభావంతోనే ఉన్నట్టు చెప్పాడు. దేశవాళీ క్రికెట్‌లో తన బ్యాటింగ్‌పై సంతృప్తికరంగానే ఉన్నానని, ముస్తాక్ అలీ ట్రోఫీతోపాటు రంజీల్లోనూ పరుగులు సాధించడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. తనలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని, ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి ఏమైనా జరగొచ్చన్నాడు. ఇప్పటికైతే రంజీ ట్రోఫీ సెమీస్‌పైనే దృష్టి సారించినట్టు వివరించాడు.

 

కాగా, టీమిండియాలో నిలకడకు మారుపేరైన రహానే ఒక్కసారిగా జట్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలో స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరించి జట్టుకు విజయాన్ని కూడా అందించాడు. 2023 డబ్ల్యూటీసీ ఫైనల్‌లో సెంచరీ చేశాడు. అయినప్పటికీ ఆ తర్వాత జట్టులో అతడి స్థానం గల్లంతైంది. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబైకి సారథ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడి ఒక సెంచరీ చేసి జట్టును సెమీస్‌కు చేర్చాడు. మూడుసార్లు 90కిపైగా, ఒకసారి 80కిపైగా పరుగులు చేశాడు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు