ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సమాయాత్తమౌతోన్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. కాంగ్రెస్ కూడా సొంతంగా బరిలో దిగిన త్రిముఖ పోటీ ఏర్పడటం ఖాయమౌతుంది.
ఊహించినట్టే ఫిబ్రవరి మొదటివారంలో ఈ ఎన్నకలు షెడ్యూల్ అయ్యాయి. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ మేరకు ఢిల్లీ విజ్ఞాన్ భవన్లోని ప్లానెరీ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధుతో కలిసి మాట్లాడారు.
ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అదే నెల 8వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. 2013లో దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇఫ్పటివరకూ చెక్కు చెదరట్లేదా పార్టీ ఓటుబ్యాంక్.
1998లో చివరిసారిగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీని పాలించింది. 2013లో కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుంచీ ఈ రెండు పార్టీలను కాదని ఆమ్ ఆద్మీకే పట్టం కడుతూ వస్తోన్నారు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో ఆప్ అభ్యర్థులను గెలిపిస్తూ వస్తోన్నారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్కు ఏ మాత్రం కొరుకుడు పడట్లేదు హస్తినాపురి.
ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి ఈ రెండు పార్టీలు. ఈ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల జాబితాలనూ ఆయా పార్టీలు ఇప్పటికే వెల్లడించాయి కూడా. దశలవారీగా ఈ ప్రక్రియను కొనసాగిస్తోన్నాయి. బీజేపీ ఇటీవలే తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే.









