లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే శబరిమలకు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం రానుంది. ఈ మేరకు ప్రతిపాదనలు వేగంగా కదులుతున్నాయి. స్థానికంగా అటవీ ప్రాంతం కావటంతో ముందుగా అక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన భూసమీకరణ.. స్థానిక పరిస్థితుల పైన జిల్లా యంత్రంగం నివేదిక సమర్పించింది. విమానాశ్రయం కోసం 1039.876 హెక్టార్ల భూమి అవసరం అవసరమని నివేదించిన అధికారులు.. ఇందుకు మార్గాన్ని సూచించారు. దీని పైన వచ్చే వారం కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
దేశ వ్యాప్తంగా అయ్యప్ప భక్తులు తరలి వచ్చే శబరిమల సమీపంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు ప్రణాళికలు వేగంగా అమలు చేస్తున్నారు. విమానాశ్రయం కోసం 1039.876 హెక్టార్ల భూమి అవసరం ఉంటుంది. ఆ భూమిని మణిమాల, ఎరుమేలి సౌత్ గ్రామాల నుంచి సేకరించేలా ప్రణాళికలు సిద్దం చేసారు. దీని ద్వారా శబరిమల యాత్రికులు, ఎన్ఆర్ఐలు, పర్యాటకులు, ఇతర ప్రయాణికుల ఉద్దేశంతో కేఎస్ఐడీసీ ప్రాజెక్టును చేపడుతున్నారు. శబరిమల ఎయిర్‌పోర్టుతో ట్రావెన్కోర్ యాత్రా స్థలాలకు వెళ్లే మార్గాలకు దారి సులువు అవుతుంది.
వావరు మసీదు, మార మన్ కన్వెన్షన్, ఎటుమన్నూర్ మహాదేవ ఆలయం లాంటి ప్రదేశాలకు యాక్సిస్ పెరుగుతుంది. స్థానికంగా ఆర్థిక వ్యవస్థ బలపడుతుందంటూ నివేదికల్లో పేర్కొన్నారు. అదే విధంగా టూరిస్టుల సంఖ్య పెరగనున్నది. కుమరొక్కం బ్యాక్‌వాటర్స్, మున్నార్ హిల్ స్టేషన్స్, గావి ఫారెస్ట్, టెక్కడీ వైల్డ్‌లైఫ్ సాంక్చరీ, పెరియార్ టైగర్ రిజర్వ్, ఇడుక్కి డ్యామ్‌కు లింకు రోడ్డు మార్గం సులభతరం అవుతుందని అధికారులు వెల్లడించారు. విమానాశ్రయం కోసం తొలిగించాల్సి చెట్ల సంఖ్యతో పాటుగా సోషల్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ నివేదికను సమర్పించారు. దాదాపు 353 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంటుందని తేల్చారు.
చెట్లతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న ఏడు మతపరమైన ప్రదేశాలను మార్చాల్సి వస్తోందని రిపోర్టు లో పేర్కొన్నారు. ఈ నివేదిక పైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంప్రదింపులు చేసేందుకు సిద్దం అవుతున్నాయి. ఇదే సమయంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి ముందస్తుగా అధ్యయనం చేయనున్నారు. ఆ తరువాత విమానాశ్రయం ఏర్పాటు దిశగా అవసరమైన కార్యాచరణ పై ప్లాన్ సిద్దం అవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు.