Search
Close this search box.

  ఆ రెండు పథకాల అమలు పై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం..

ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంక్షేమ పథకాల అమలు పైన స్పష్టత ఇచ్చారు. అమరావతిలో నిర్మాణ పనులతో సహా రాష్ట్రంలో కొత్త పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. అదే విధంగా మున్సిపల్ తో సహా పలు చట్ట సవరణలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ నెల 8న విశాఖ లో జరిగే ప్రధాని పర్యటన పైన మంత్రులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేసారు. డీఎస్సీ నియామక ప్రక్రియ పైన చర్చ జరిగింది.

 

సంక్షేమ పథకాల అమలు

ఏపీ మంత్రివర్గ సమావేశంలో సూపర్ సిక్స్ పథకాల అమలు పైన చర్చ జరిగింది. వచ్చే విద్య సంవత్సరం లోపు తల్లికి వందనం అమలు చేయాలని.. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆర్దిక – విద్య శాఖను కేబినెట్ ఆదేశించింది. అదే విధంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోగా డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అన్నదాత సుఖీభవ పథకం అమలు పైనా చర్చ జరిగింది. వచ్చే నెలలో కేంద్రం పీఎం కిసాన్ నిధులు విడుదల తరువాత వెంటనే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల అయ్యేలా కార్యాచరణ సిద్దం చేయాలని చంద్రబాబు సూచించారు.

 

కీలక ప్రాజెక్టులకు ఆమోదం

రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్న తీరుతెన్నుల తో పాటుగా ఆర్దికంగా ఎదురవుతున్న సమస్యల పైన చర్చ జరిగింది. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెవెన్యూ, ఫైనాన్స్, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రులతో ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ భేటీలో 14 కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో రూ.2733 కోట్ల పనులకు కేబినెట్ ఆమోదిం చింది. అమరావతిలో రెండు ఇంజనీరింగ్‌ కాలేజీల పనులకు, భవనాలు, లేఔట్‌ల అనుమతుల ను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ చేసిన సవరణ ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

 

ఆర్దిక పరిస్థితుల పై పవన్ ఆరా

తిరుపతిలో ఈఎస్‌ఐ ఆస్పత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు పెంపు ప్రతిపాదనకు కేబినెట్ అంగీకరించింది. పిఠాపురం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీలో 19 నూతన పోస్టులకు అనుమతి ఇచ్చింది. ఎస్‌ఐపీబీ ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 2,63,411 మందికి ఉద్యోగాలు కల్పించే అంశంపై చర్చించారు. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రధాని రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రులకు సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. పలు పరిశ్రమలకు భూ కేటాయింపులు చేస్తూ కేబినెట్‌ నిర్ణయించింది. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి పైన పవన్ ప్రత్యేకంగా ఆరా తీసారు. ఆర్దిక శాఖ ప్రస్తుత పరిస్థితుల పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు