ఏపీ రాజధాని అమరావతిపై కూటమి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. వచ్చే నెల నుంచి రాజధానిలో నిర్మాణాలు చేపట్టాలని భావిస్తోంది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ 15 వేల కోట్ల రుణం అందనుంది. ఇదే సమయంలో అమరావతిలో గతంలో మాస్టర్ ప్లాన్ విషయంలో సహకారం అందించిన సింగపూర్ ను మరోసారి భాగస్వాములను చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు కేంద్రానికి అభ్యర్ధన చేసారు. కేంద్రం నిర్ణయం కీలకం కానుంది.
సింగపూర్ కు అనుమతివ్వండి
అమరావతి నిర్మాణంలో 2014-19 కాలంలో సింగపూర్ తో కలిసి ఏపీ ప్రభుత్వం పని చేసింది. రెండు ప్రభుత్వాల భాగస్వామ్యంతో మాస్టర్ ప్లాన్ తో సహా నిర్మాణాల పైన కలిసి పని చేసాయి. 2019 లో ప్రభుత్వం మారిన తరువాత సింగపూర్ అమరావతి ప్రాజెక్టు నుంచి దూరంగా ఉంది. అమరావతికి సంబంధించి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఏపీ ప్రభుత్వంతో కలిసి కీలకంగా వ్యవహరించారు. ఆ తరువాత సింగపూర్ లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తిరిగి అమరావతి పనులు ప్రారంభిస్తున్న వేళ తిరిగి సింగపూర్ భాగస్వామ్యం అవసరమని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.
అమరావతి పై ఫోకస్
ఇదే అంశం పైన ఢిల్లీ పర్యటనలో విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌తో చర్చించారు. అమరావతి కోసం సింగపూర్ తో భాగస్వామ్యం పునరుద్ధరించాలని కోరారు. అదే విధంగా పెట్టుబడుల కోసం విదేశీ కంపెనీలను ఏపీకి ఆహ్వానించాలని కోరగా.. అందుకు ఆయన సానుకూలంగా స్పందిం చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రతిపాదన పైన కేంద్రం నిర్ణయం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇక, సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ సమావేశం అయ్యారు. గోదావరి- కృష్ణా- పెన్నా నదుల అనుసంధానంతో రాష్ట్ర రూపురేఖలు మారిపోను న్నాయని దీనికి కేంద్రం ఆర్థికంగా అండగా నిలబడాలని కోరారు.
కేంద్రానికి వినతులు
కేంద్ర ఆర్దిక మంత్రితో సమావేశంలో రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతల మైన విజయవాడను ఆదుకునేందుకు రాష్ట్ర జీఎస్టీపై తాత్కాలికంగా ఒక శాతం అదనపు సర్‌ఛార్జీని విధించేందుకు వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తిచేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదుల అనుసంధానానికి కేంద్రం సాయం చేస్తున్నట్లుగానే ఏపీకి సహకరించాలని నిర్మలాను కోరారు. ఇందు కోసం తమ ప్రణాళికలను వివరించారు. దాదాపుగా రూ 60 వేల కోట్ల వరకు ఖర్చయ్యే ఈ ప్రాజెక్ట్ కు కేంద్రం సహకరించాలని చంద్రబాబు వినతి పత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి ఈ రోజు మహారాష్ట్రలో బీజేపీ కూటమి తరపున ప్రచారానికి వెల్లనున్నారు. అక్కడ తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు.