తెలంగాణలోని గ్రూప్-1 అభ్యర్థుల కోసం టీజీపీఎస్సీ కీలక ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి గ్రూప్-1 విద్యార్థులు మెయిన్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. అభ్యర్థులు తమ హాట్‌టెకెట్లను టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా పొందొచ్చని వెల్లడించింది.
ఈ హాల్ టికెట్లను వెబ్సైట్లో విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసి, డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే కమిషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా హాల్టికెట్లకు సంబంధించిన ప్రకటన వెలువరించింది.
మొత్తం 563 గ్రూప్ 1 ఖాళీలకు..
ఈ రిక్రూట్మెంట్ ద్వారా తెలంగాణలో మొత్తం 563 గ్రూప్ 1 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా మెయిన్స్ మొత్తం 7 పేపర్లకు పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే గ్రూప్-1 మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసి, హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే, టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలకూ తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఈ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సమయంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ లేదా కమిషన్ అధికారులను సంప్రదించాల్సిందిగా కోరింది.









