ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో రూపొందిన చిత్రం ‘దేవర’ పార్ట్-1. ఎన్నో అంచనాల మధ్య ఇటీవల విడుదలైన ఈ చిత్రం మొదటిరోజు కాస్త మిక్స్డ్ టాక్నే తెచ్చుకున్నప్పటికీ ప్రారంభ వసూళ్లు సాధించడంలో దూసుకుపోయింది. దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత ఎన్టీఆర్ సినిమా కావడంతో పాటు సినిమాలో ఆకట్టుకునే అంశాలు ఉండటంతో సినిమా కలెక్షన్ల విషయంలో ఎక్కడా కూడా డ్రాప్ కాలేదు.
ఈ సినిమా విడుదలైన రెండో వారంలో దసరా సెలవులు రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఆదరించడంతో వసూళ్లు ఆశాజనకంగానే కనిపించాయి. అయితే ఈ చిత్రం విడుదలకు ముందు రోజు అర్థరాత్రి ఒంటి గంట నుంచే రెండు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేశారు. ఆ ప్రీమియర్స్లో వచ్చిన టాక్ కొంత డివైడ్గా ఉంది. తదుపరి రోజు నుంచి మాత్రం సాధారణ ప్రేక్షకులు, ఎన్టీఆర్ అభిమానులు సినిమాను ఆదరించారు.
అయితే దేవర చిత్రాన్ని రెండు రాష్ట్రాల పంపిణీ హక్కులను కొనుగోలు చేసిన నిర్మాత నాగవంశీని ఈ రోజు జరిగిన లక్కీ భాస్కర్ ప్రెస్మీట్లో ఇలా ప్రీమియర్స్ వేయడం వల్ల లాభామా? నష్టమా? అని విలేకరులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
ఆయన మాట్లాడుతూ ”సినిమా విజయం సాధించింది అంటే లాభమనే చెప్పాలి కదా. పైగా దేవర అర్థరాత్రి షోలు వేయడం వల్ల నాకో విషయం అర్థమైంది. అదేంటంటే అర్థరాత్రి షోలకు వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా, సినిమాలో విషయం ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. అందుకే ‘లక్కీ భాస్కర్’ విషయానికి వస్తే… అర్థరాత్రి షోలు కాకుండా, ముందురోజు సాయంత్రం నుంచే సాధారణ షోలు ప్రదర్శించబోతున్నాము” అని తెలిపారు.