Search
Close this search box.

  బీజేపీకి బిగ్ టాస్క్..?

రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బీజేపీ జోష్ మీద ఉంది. బీజేపీతో పాటుగా మిత్రపక్షాల నేతలు ఇప్పుడు జమిలికి మద్దతుగా వాయిస్ పెంచుతున్నారు. అయితే, బీజేపీకి జమిలి పైన వేగంగా అడుగులు వేయాలంటే త్వరలో జరిగే నాలుగు రాష్ట్రాల ఎన్నికలు కీలకం కానున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాల తరువాతనే పార్లమెంట్ లో జమిలి ప్రక్రియను ప్రారంభించేందుకు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సిద్దం అవుతోంది.

 

జమిలి వేళ బిగ్ టాస్క్

హార్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. అటు జమ్ము కాశ్మీర్ లోనూ గౌరవమైన సీట్లను సాధించింది. దీంతో..ఇప్పుడు మరోసారి దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణ పైన చర్చ మొదలైంది. ఈ సమయంలోనే బీజేపీకి మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమర్థతకు పరీక్షగా నిలుస్తున్నాయి. మరో వారంలో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. ఈ రెండు రాష్ట్రాల్లో గెలుపు ఎన్డీఏకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. కేంద్రంలో తక్కువ మెజార్టీతో మూడో సారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీకి మిత్రపక్షాల నుంచి రాజకీయంగా ఒత్తిడి తగ్గాలంటే ఈ రెండు రాష్ట్రాల్లోనూ సానుకూల ఫలితాలు అవసరం.

 

ఆపరేషన్ మహారాష్ట్ర

మహారాష్ట్రలో ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షా ఆపరేషన్ ప్రారంభించారు. అటు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్ థాక్రే) పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. సీఎంగా ఎవరైనా పర్వాలేదు.. మహారాష్ట్ర భవిష్యత్ ముఖ్యమని థాక్రే ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ బీజేపీ – శివసేన చీలిక వర్గంతో పాటుగా ఎన్సీపీ చీలిక నేతలతో సీట్ల సర్దుబాట్ల పైన చర్చలు చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా సీట్ల లెక్కలు తేల్చి ఉమ్మడి అజెండాతో ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని భావిస్తోంది. నవంబర్ చివరి నాటికి మహారాష్ట్రలో కొత్త అసెంబ్లీ కొలువు తీరాల్సి ఉంది. దీంతో..మహారాష్ట్ర, జార్ఖండ్ పైనే ప్రస్తుతం మోదీ ద్వయం ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. పోటీ అభ్యర్ధుల ఖరారులో ప్రాంతీయ – సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

 

బీజేపీ సమర్థతకు పరీక్ష

ఇప్పుడు హర్యానా, జమ్ము కాశ్మీర్ ఫలితాల తరువాత మిత్రపక్షాల నుంచి బీజేపీకి కొంత రిలీఫ్ దక్కింది. ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ లోనూ విజయం సాధిస్తే మోదీకి తిరిగి పూర్తి పట్టు సాధించే అవకాశం ఉంది. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు సానుకూలంగా ఉంటే జమిలి విషయంలోనూ మోదీ మరింత వేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. అయితే, మహారాష్ట్ర తో పాటుగా జార్ఖండ్, ఢిల్లీ, బీహార్ లో బీజేపీకి ప్రస్తుత పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవనేది సర్వే సంస్థల అంచనాలు. అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా హర్యానాలో విజయం సాధించిన బీజేపీ..రానున్న ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ అవుతుందని ధీమాగా ఉంది. దీంతో.. జమిలి వంటి చారిత్రాత్మక నిర్ణయం అమలుకు ముందు ఈ ఎన్నికలు బీజేపీకి బిగ్ టాస్క్ గా మారతున్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు