Search
Close this search box.

  కవితను జైల్లో పెట్టినా భయపడకుండా పోరాటం చేస్తూనే ఉన్నాం: కేటీఆర్..

తన చెల్లెలు కవితను కక్షగట్టి తీహార్ జైల్లో పెట్టారని, అయినప్పటికీ తాము భయపడకుండా పోరాటం చేస్తూనే ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత మహ్మద్ అల్లావుద్దీన్, పలువురు తెలంగాణ నేతలు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.

 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందన్నారు. రాష్ట్రంలో దసరా పండుగ చేసుకునే వీలులేకుండా భయానక వాతావరణం సృష్టించారని ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా ఉంటే రైతుబంధు, బతుకమ్మ చీరలు వచ్చి ఉండేవన్నారు. ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుకోకుండా డీజేను బంద్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

రైతులకు రుణమాఫీ పూర్తిగా కాలేదన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, కానీ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. రాష్ట్రంలో ఒక్క మహిళకూ రూ. 2,500 రాలేదన్నారు. మూసీ ప్రక్షాళన పేరిట లక్ష కోట్ల రూపాయలను కాజేయాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. కమీషన్లు రావు కాబట్టే ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు.

 

హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని, అక్కడి ఫలితాలు చూశాక అయినా తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు. కేసీఆర్ లేని లోటును హైదరాబాద్‌లో ప్రతి ఒక్కరూ గుర్తుకు చేసుకుంటున్నారని తెలిపారు. సీఎం సొంత నియోజకవర్గంలో రైతులు, ప్రజలకు అండగా నిలబడిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని దుర్మార్గంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు