మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వరుసగా జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి ఆరు నెలల సమయం తరువాత ప్రతిపక్ష పాత్ర పోషించాలని నిర్ణయించిన జగన్ ఇప్పుడు ఆ దిశగా ఇక ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. పార్టీలో ప్రాంతీయ సమన్వయ వ్యవస్థను రద్దు చేసారు.
జగన్ కార్యాచరణ
మాజీ సీఎం జగన్ పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు నిర్వహించిన జిల్లాల సమీక్షలు…నియామకాల పైన చర్చించారు. పలు జిల్లాలకు ఇంకా అధ్యక్షుల నియామకం పైన ఫోకస్ చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం పైన నాలుగు నెలల కాలంలోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని జగన్ చెబుతున్నారు. కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చిన తరువాత ప్రజల్లోకి వెళ్లాలనేది తన ఆలోచనగా జగన్ చెబుతూ వచ్చారు. దీంతో, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన ప్రజల్లోనే చర్చ జరుగుతోందని జగన్ పార్టీ నేతలకు వివరించారు.
ఆ వ్యవస్థ రద్దు
ఇక, పార్టీలో అధికారంలో ఉన్న సమయంలో అమలు చేసిన ప్రాంతీయ సమన్వయకర్తల వ్యవస్థ ను రద్దు చేయాలని నిర్ణయించారు. రెండు లేదా మూడు జిల్లాలకు ఒక సీనియర్ నేతను ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించి..వారితో జిల్లాలను పర్యవేక్షించే వారు. ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసి జిల్లా అధ్యక్షులకే పూర్తిగా పార్టీ బాధ్యతలను అప్పగించాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా దసరా తరువాత మిగిలిన జిల్లాలకు అధ్యక్షులను నియమించాలని నిర్ణయించారు. అనుబంధ సంఘాలతో పాటుగా పార్టీ కోసం పని చేసిన వారికి రాష్ట్ర, జిల్లా స్థాయిలో గుర్తింపు ఇచ్చేలా నియామకాలు ఉంటాయని..పార్టీ సభ్యత్వం పెంచుకునేలా కొత్త కార్యక్రమం డిసెంబర్ లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
జిల్లాల పర్యటన
ఇక…జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటనలకు సిద్దమవుతున్నారు. ప్రతీ జిల్లాలోనూ పర్యటించి అక్కడి అన్ని నియోజకవర్గాల నేతలతో సమావేశం కానున్నారు. అదే విధంగా అనుంబంధ సంఘాలతోనూ సమావేశం కావాలని డిసైడ్ అయ్యారు. ప్రతీ నియోజకవర్గానికి చెందిన వారికి అందుబాటులో ఉండేలా జగన్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల్లో స్థానిక అంశాల పైన ప్రజల పక్షాన నిలబడాలని సూచిస్తూనే..రాష్ట్ర స్థాయి అంశాల పైన తానే అవసరమైన విధంగా ఆందోళనలు నిర్వహించేందుకు జగన్ సిద్దమవుతున్నారు. ముందుగా పార్టీని ప్రతీ నియోజకవర్గం లో బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యారు.