ఏపీ రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ స్టోరీ ఓ సంచలనమే అని చెప్పాలి. సాధారణంగా అందరి రాజకీయ నాయకులకు శత్రువులు ఉంటారు. కానీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు మాత్రం శత్రువులు ఎక్కడో లేరు ఆయన సొంత ఇంట్లోనే ఉన్నారు. గత ఎన్నికల ముందు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో చోటు చేసుకున్న విభేదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాస్‌కు పోటీగా ఆయన భార్య దువ్వాడ వాణి గత ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అయ్యారు. ఈ విషయంలో జగన్ కలుగజేసుకోవడంతో దువ్వాడ వాణి పోటీ నుంచి విరమించుకున్నారు.
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథ చిత్రం మరో మలుపు తిరిగింది. దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణిని కాదని ,దివ్వెల మాధురితో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో దువ్వాడ శ్రీనివాస్ భార్య , కూతుర్లు బహిరంగంగానే అతనిపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో వారు టెక్కలిలోని ఇంటిని వెంటనే ఖాళీ చేయాలంటూ వాణి తన కూతుళ్లు, కలిసి అక్కడే బైఠాయించారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ సహజీవనం వ్యవహారం కోర్టులో నడుస్తోంది.
ఈక్రమంలోనే దివ్వెల మాధురితో పెళ్లి గురించి దువ్వాడ శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. దివ్వెల మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ తిరుమలలో ప్రత్యక్ష్యమైయ్యారు. సోమవారం వారు వీఐపీ బ్రేక్ దర్శనంలో భాగంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి పుష్కరిణి దగ్గర మాధురి షూట్ కొనసాగింది. ఈ క్రమంలోనే వారు పెళ్లిపై సంచలన ప్రకటన చేశారు. కోర్టు కేసులు అన్ని ముగిశాక త్వరలోనే అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటామని ప్రకటించారు. అప్పటి వరకు తాము కలిసే ఉంటామని దివ్వెల మాధురి తెలిపారు. రెండేళ్లుగా మాధురితోనే కలిసి ఉంటున్నానని దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. కోర్టు కేసులు క్లియర్ అవ్వగానే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి, పెళ్లిపై ఇరువురు క్లారిటీ ఇచ్చారు.