హర్యానాలో ఈసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలకు చావోరేవోగా మారాయి. అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతుండగా.. కాంగ్రెస్ దూకుడు ఆ పార్టీ ఆశలకు గండి కొట్టేలా కనిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల నేతల చేరికలు ఆ పార్టీని టెన్షన్ పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యూహప్రతివ్యూహాలు రచిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా అలర్ట్ అయింది.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఉద్యోగులు, అధికారుల్ని రేపు పోలింగ్ సమయంలో ప్రభావితం చేసే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ అంచనా వేస్తోంది. దీంతో తమ బూత్ వర్కర్లను అప్రమత్తం చేస్తోంది. పోలింగ్ శాతం పెరగకుండా బీజేపీ అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని భావిస్తున్న కాంగ్రెస్.. సాధ్యమైనంత ఎక్కువ మందిని ఓటేసేలా ప్రోత్సహించాలని కోరుతోంది. అదే సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనల్ని అడ్డుకునేందుకు ప్రతీ నియోజకవర్గానికీ లీగల్ టీమ్స్ ను పంపుతోంది.
హర్యానా ఎన్నికల్లో గెలుపుని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఓ వార్ రూమ్, చంఢీఘడ్ లో మరో వార్ రూమ్ ఏర్పాటు చేసి రేపటి ఎన్నికలను పర్యవేక్షించబోతున్నారు. ఇప్పటికే పలు సర్వేలు కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం ఇచ్చిన నేపథ్యంలో చివరి నిమిషంలో తప్పిదాలు జరగకుండా చూసుకోవాలనేది ఆ పార్టీ ఉద్దేశంగా కనిపిస్తోంది. దీంతో రేపటి ఎన్నికల పోలింగ్ హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.