మంత్రి కొండా సురేఖ మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని తనపై పిచ్చి రాతలు రాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆరే అని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించారు. కవిత బెయిల్ కోసం ప్రధానితో మాట్లాడి ఒప్పందం చేసుకున్నారని సురేఖ విమర్శించారు.
సురేఖ, కేటీఆర్ మధ్య మూడు రోజులుగా వివాదం కొనసాగుతోంది. దుబ్బాకలో జరిగిన ఓ కార్యక్రమానికి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో స్థానిక ఎంపీ రఘునందన్ రావు చేనేత కార్మికులు రూపొందించిన ఓ కండువాను అక్క అంటూ.. సురేఖకు బహుకరించారు. దీన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. దీనిపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. మహిల మంత్రి అసభ్యకరంగా కామెంట్లు చేస్తారా అని కన్నీరు పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమని చెప్పారు. అలాగే.. సమంతపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, సమంత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అలాగే సినీ ప్రముఖులు కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దీనిపై కూడా సురేఖ స్పందించారు. సమంతపై కావాలని వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు.
కేటీఆర్ ను విమర్శిస్తున్న క్రమంలో అలా మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు. ఇందుకు చింతిస్తున్నట్లు చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లుగా కూడా ప్రకటించారు. కాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపారు. అయినప్పటికీ ఆమె వెనక్కు తగ్గకుండా కేటీఆర్ పై మరోసారి విరుచుకుపడ్డారు.