స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ త్వరలోనే టీటీడీ బోర్డ్ మెంబర్ గా నియమితులు కానున్నారని సమాచారం. ఈ మధ్యకాలంలో ఆయన తరచుగా తిరుపతిలో ప్రత్యక్షమవుతున్నారు. తాజాగా పవన్ కాలినడకన తిరుమల పర్యటన చేయగా, త్రివిక్రమ్ కూడా వెళ్లడం గమనార్హం.
టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బంధం ఎంతటి బలమైనదో అందరికీ తెలిసిందే. అయితే త్రివిక్రమ్ ను పవన్ నమ్మినంతగా మరెవరూ నమ్మరని తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారు లేరంటే అతిశయోక్తి అవుతుంది.
ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి బ్రాహ్మణ కోటాలో టీటీడీ సభ్యులుగా నియమితులు కావడం అంటే చాలానే బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఉంటుంది. ఇందుకు అనేక లెక్కలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఫలితంగా ఈసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ కు తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్ షిప్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం అవుతోంది.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా జనసేన కోటాలో ఈ దర్శకుడు బాధ్యతలు తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉందంటున్నారు. గతం నుంచి త్రివిక్రమ్, పవన్ మధ్య కమ్యూనికేషన్ చాలా బలంగా ఉంటుందని సినీ అభిమానులకు సైతం తెలిసిందే. పవన్ కు ఏదైనా కొత్త విషయాన్ని చెప్పాలన్నా, అందుకు ఆయన్ను ఒప్పించి మెప్పించాలన్నా అందుకు ఈ మాటల మాంత్రికుడే సరైన వ్యక్తి అని జనాలు సైతం నమ్ముతున్నారు.
దీంతో త్రివిక్రమ్ కోరుకుంటే టీటీడీ మెంబర్ కావడం ఖాయంగా తెలుస్తోంది. లేదా జనసేనానే స్వచ్ఛందంగా వారి అనుబంధం రీత్యా ఆయన్ను టీటీడీకి రికమెండ్ చేసినా ఇట్టే పని అయిపోతుందని టాక్. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ నియామకంతో శ్రీవారి పక్షాన అటు ప్రభుత్వానికి, ఇటు భక్తుల మధ్య అనుసంధాన కర్తగా ఉండే అవకాశం వస్తుందని అధికార వర్గాలు భవిస్తున్నాయట. పవన్ కల్యాణ్ తిరుమల క్షేత్రం వచ్చినప్పుడల్లా, ఆయన కూడా కనిపిస్తుంటే పదవి ఖాయమని అంతా అనుకోవడం గమనార్హం.