ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వద్ద గాంధీ సమాధికి పూల మాలే వేసి అంజలి ఘటించారు. ఆ తర్వాత గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పాఠశాల విద్యార్థులతో కరచాలనం చేశారు. అనంతరం బాపు ఘాట్ దగ్గర సర్వమత ప్రార్థనలు చేశారు. అయితే బాపు ఘాట్ కు అదే సమయంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ వచ్చారు.
సీఎం, మంత్రులతో కలిసి ఆయన కూడా మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీనియర్ నేత హనుమంత రావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు పాల్గొన్నారు. మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా బాపు ఘాట్ వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు.









