తిరుమలలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి వాడారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నాయంటూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ విచారణలో నెయ్యి కల్తీ జరిగిందనడానికి ఆధారాలు ఏవని సుప్రింకోర్టు ప్రశ్నించింది. ఇదే అంశంపై టీటీడీ లాయర్ గా ఉన్న సిద్ధార్ద్ లూథ్రా కీలక వివరాలు వెల్లడించారు.
సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లలో టీటీడీ తరఫున లాయర్ గా వాదిస్తున్న సిద్ధార్ధ్ లూథ్రా తిరుమలలో లడ్డూ తయారీ కోసం కల్తీ అయిన నెయ్యి వాడారా లేదా అన్న అంశంపై క్లారిటీ ఇచ్చారు. చివరి సారి తీసుకున్న రెండు ట్యాంకర్లలో నెయ్యి కల్తీ అయినట్లు ల్యాబ్ రిపోర్టులు ఉన్నాయని ఆయన తెలిపారు. అలాగే గతంలో వచ్చిన ట్యాంకర్ల శాంపిల్స్ మాత్రం పరీక్షలకు పంపలేదన్నారు. తద్వారా లడ్డూ కల్తీ కాలేదని ఆయన పరోక్షంగా అంగీకరించారు.
ఈ లెక్కన చూస్తే గత రెండు ట్యాంకర్లలో నెయ్యి కల్తీ కావడంతో అంతకు ముందు వచ్చిన ట్యాంకర్ల నెయ్యి కూడా కల్తీ అయినట్లు టీటీడీ కానీ ప్రభుత్వం కానీ భావించినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగానే చంద్రబాబు నెయ్యి కల్తీ పై వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. అందుకే లడ్డూకు వాడిన నెయ్యి కల్తీపై ఆధారాలు ఉన్నాయా అని ఇవాళ సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు టీటీడీ వద్ద సమాధానం లేకుండా పోయింది. అయితే అక్టోబర్ 3న విచారణలో దీనిపై టీటీడీ కూడా క్లారిటీ ఇవ్వబోతోంది.