Search
Close this search box.

  వైఎస్ జగన్ పై దేశ బహిష్కరణ వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి..

తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్ తిరుమల పర్యటన ఆపేసుకున్నారని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. నేడు మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వంగలపూడి అనిత మాట్లాడుతూ జగన్ పై దేశ బహిష్కరణ వ్యాఖ్యలు చేశారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న జగన్ చెబుతున్నవన్నీ కుంటిసాకులేనని ఆమె అన్నారు.

 

తిరుమల లడ్డూ టేస్ట్ ఎప్పుడు చూశారు జగన్?

డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకి వెళితే తన తల్లికి, చెల్లికి పట్టిన గతే తనకు పడుతుందని భయపడి జగన్ పర్యటన రద్దు చేసుకున్నారని ఆమె వ్యాఖ్యలు చేశారు. ఇదంతా జగన్ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. తిరుమలలో లడ్డూ టేస్ట్ గురించి మాట్లాడిన జగన్ ఏ రోజు తిరుమల లడ్డు రుచి చూశాడో చెప్పాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు.

 

జనాలను మభ్యపెట్టటం కోసమే పర్యటన రద్దు

పూటకో మాట జగన్ కు బాగా అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె ఆఖరి నిమిషంలో తిరుమల పర్యటన ఆపేసుకున్నారని, అయితే నోటీసులు ఇవ్వడం వలన తాను తిరుమల పర్యటన రద్దు చేసుకున్నానని చెబుతున్నారని కానీ జగన్ చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలు అంటూ ఆరోపించారు. జగన్ తాను చెప్పే అబద్ధాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని వంగలపూడి అనిత పేర్కొన్నారు.

 

జగన్ ను దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదు

తిరుమలకు వెళ్ళకూడదని జగన్ కు ఎవరు నోటీసులు ఇవ్వలేదని, ఏ ఒక్క నాయకుడిని గృహనిర్బంధం చేయలేదని పేర్కొన్న ఆమె తిరుమల వెళ్లడం ఇష్టంలేకనే డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే ఈ డ్రామాలకు తెర తీశారన్నారు. దేశాన్ని కించపరుస్తున్న జగన్ ను దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదు అంటూ వంగలపూడి అనిత ప్రశ్నించారు. సెల్ఫ్ గోల్స్ తో తనని దేశ బహిష్కరణ చేసే పరిస్థితి జగనే తెచ్చుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

 

జగన్ ధోరణి ఇది.. అన్నీ కథలే

జగన్ కు ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో చుట్టి పక్కన పడేయడం, అక్షింతలు వేసే తల దులిపేసుకున్న సందర్భాలు ఎన్నో చూసామని గుర్తు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ నేపథ్యంలో తిరుమలలో సెక్షన్ 30 యాక్ట్ తీసుకువస్తే అది తనను ఉద్దేశించే జారీ చేసినట్టు జగన్ కథలు అల్లాడిని వంగలపూడి అనిత మండిపడ్డారు.

 

జగన్ మానవత్వం తల్లి, చెల్లిని చూస్తే తెలుస్తుంది

దేవుడైన సరే తన గుమ్మం ముందుకే రావాలనుకునే తత్వం జగన్ అని కాబట్టే ఇంటి వద్ద గుడి సెట్టింగ్ వేసుకున్నారంటూ వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిక్లరేషన్ ఇవ్వమంటే దళితులకు ఈ అంశాన్ని ముడిపెట్టి మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని వంగలపూడి అనిత పేర్కొన్నారు. నా మతం మానవత్వం అని చెప్పిన జగన్ తల్లి చెల్లిని చూస్తేనే ఆయన మానవత్వం ఏమిటో అర్థం అవుతుందని హోంమంత్రి అనిత సెటైర్లు వేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు